Abhishek Sharma : 2024 వరకు అనామకుడు.. 2026లో వరల్డ్ నంబర్ 1 టీ20 క్రికెటర్.. రెండేళ్లలో ఎలా సాధ్యమయ్యింది..?

Published : Jan 29, 2026, 02:00 PM ISTUpdated : Jan 29, 2026, 02:26 PM IST

అభిషేక్ శర్మ... ఈ పేరు వరల్డ్ క్రికెట్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ టీమిండియా విధ్వంసక బ్యాటర్ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 2023 వరకు ఎవరికీ తెలియని ఇతడు ఇప్పుడు నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్న అభిషేక్

Abhishek Sharma : నూనుగు మీసాల కుర్రాడు అభిషేక్ శర్మ వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్నాడు. సెహ్వాగ్, ధోని వంటి ధనాధన్ క్రికెటర్లను మరిపించేలా ఈ 25 ఏళ్ల కుర్రాడి మెరుపు ఇన్నింగ్స్ లు ఉంటున్నాయి. చివరకు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు యువరాజ్ సింగ్ నే తదదన్నేలా… బంతికే భయం పుట్టేలా ఆడుతున్నాడు. చివరకు ఎవరూ టచ్ చేయని యువీ అరుదైన రికార్డును బద్దలుగొట్టినంత పని చేశాడు. టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ క్రీజులోనే శివతాండవం చేస్తున్న అభిషేక్ శర్మ ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ కు చేరాడు. ఇలా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో 929 పాయింట్స్ తో నెంబర్ వన్ బ్యాటర్ గా మారాడు అభిషేక్.

26
అభిషేక్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా..?

అభిషేక్ ఇప్పటివరకు టీమిండియా తరపున 37 ఇంటర్నేషన్ టీ20 మ్యాచులాడి 1267 పరుగులు చేశాడు. ఈ పరుగులు సాధించేక్రమంలో అతడి స్ట్రైక్ రేట్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది... ఏకంగా 194.92 స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు సాధించాడు. టీ20 క్రికెట్లో రెండు సెంచరీలు చేశాడు... ఈ ఫార్మాట్ లో ఇతడి హయ్యెస్ట్ స్కోరు 135 పరుగులు. ఈ గణాంకాలు చూస్తేనే అభిషేక్ ఎంతడి భయంకరమైన ఆటగాడో అర్థమవుతుంది.

36
2024 వరకు అభిషేక్ ఎక్కడున్నాడు..?

ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్ అభిషేక్ శర్మ 2023 వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. 2018 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నా అతడికి ఎక్కడా సరైన గుర్తింపు రాలేదు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఒక సీజన్ ఆడి, తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. 2023 వరకు ఆ జట్టులో అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. అయితే ఒకే ఒక్క ఐపిఎల్ సీజన్ అభిషేక్ శర్మను ప్రపంచానికి పరిచయం చేసింది... టీమిండియాకు ఓ అణిముత్యాన్ని అందించింది.

46
యువరాజ్ కోచింగ్ లో రాటుదేలిన అభిషేక్..

2023 వరకు చాలా ఇబ్బందులు పడ్డ అభిషేక్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి అండగా నిలిచాడు... కేవలం ఏడాదిలోనే అభిషేక్‌లోని లోపాలను యువీ సరిదిద్దాడు. దీంతో పరిపూర్ణమైన క్రికెటర్ గా మారిన అభిషేక్ సరికొత్త ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.

2024 ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. ఆ ప్రదర్శనతోనే టీమిండియా T20I జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్రం చేయగానే సెంచరీ కొట్టి ఒక ప్రమాదకరమైన బ్యాటర్ వచ్చాడని ప్రపంచానికి చాటాడు.

56
ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసం

2024 లో సత్తాచాటిన అభిషేక్ ఐపీఎల్ 2025లో ట్రావిస్ హెడ్‌తో కలిసి అద్భుతాలు చేశాడు. హెడ్ ప్రదర్శనతో ప్రభావితమవడమే కాదు యువీ కోచింగ్ లో రాటుదేలిన అభిషేక్ తన విశ్వరూపం చూపించాడు. సన్ రైజర్స్ ఓపెనర్లిద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ తో T20 క్రికెట్ ఫార్మాట్‌నే మార్చేశారు. ఈ సీజన్లో అభిషేక్ ఆటను చూసి ఫిదా అయిన టీమిండియా సెలెక్టర్లు టీంలో అవకాశం ఇచ్చారు..  వారి నమ్మకాన్ని నిలబెడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్ లో నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాడు. 

66
గురువు రికార్డుకే ఎసరు..

2024 వరకు ఎవరికీ తెలియని అభిషేక్ శర్మ నేడు 2026 జనవరిలో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ స్థాయికి చేరడంలో యువరాజ్ సింగ్ పాత్ర చాలా ఉంది. 2011 ప్రపంచకప్‌లో యువీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అభిషేక్ ఆలోచనా విధానం కూడా యువీ లాంటిదే. సిక్సర్లు కొట్టడంలోనూ యువీ లాగే ప్రతిభావంతుడు.

ఇటీవల గువాహటిలో జరిగిన ఇండియా-న్యూజిలాండ్ 3వ టీ20లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఓ సమయంలో గురువు యువీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (12 బంతుల్లోనే) రికార్డును బద్దలుగొడతాడని అనిపించింది. ఇదే జరిగితే గురువును మించిన శిష్యుడు అయ్యేవాడు... ఇప్పుడు గురువుకు తగ్గ శిష్యుడు అయ్యాడు అభిషేక్.

Read more Photos on
click me!

Recommended Stories