మరో నాలుగు రోజుల్లో హాకీ ప్రపంచకప్.. నాలుగు సార్లు శత్రుదేశానిదే పైచేయి.. 47 ఏండ్లుగా టీమిండియాకు నిరాశే..

First Published Jan 9, 2023, 3:48 PM IST

Men's Hockey World Cup 2023: 1971లో ప్రారంభమైన హాకీ ప్రపంచకప్ లో ఇది 15వ ఎడిషన్.  ఈ టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ పాకిస్తాన్. ఆ జట్టు ఇప్పటివరకూ నాలుగు సార్లు  విశ్వవిజేతగా నిలిచింది.  కానీ ఈసారి మాత్రం.. 

గతేడాది  క్రీడా ప్రపంచాన్ని  క్రీడలు ఉర్రూతలూగించాయి. అక్టోబర్ - నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన  టీ20 ప్రపంచకప్ తో పాటు నవంబర్ - డిసెంబర్ లలో ఖతర్ లో ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరిగింది. ఈ రెండు టోర్నీల తర్వాత మరో భారీ క్రీడా సంగ్రామానికి మరో నాలుగు రోజుల్లో తెర లేవనుంది.  

ఈ నెల 13 నుంచి హాకీ ప్రపంచకప్ జరగనుంది.  వరుసగా రెండోసారి భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది.  2018 లో కూడా ఈ టోర్నీకి   ఇండియానే  హోస్ట్ గా వ్యవహరించింది.  ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలా వేదికగా  మ్యాచ్ లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో హాకీ ప్రపంచకప్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

1971లో ప్రారంభమైన హాకీ ప్రపంచకప్ లో ఇది 15వ ఎడిషన్.  ఈ టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ పాకిస్తాన్. ఆ జట్టు ఇప్పటివరకూ నాలుగు సార్లు  విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఆశ్చర్యకరంగా ఈసారి వరల్డ్ కప్ కు పాకిస్తాన్ కనీసం అర్హత కూడా సాధించకపోవడం గమనార్హం. 

ఈ టోర్నీని భారత్ లో నిర్వహించడం ఇది నాలుగోసారి.  తొలిసారి 1982 (ముంబై) లో నిర్వహించగా ఆ తర్వాత 2010 (ఢిల్లీ), 2018 (ఒడిషా)లలో కూడా భారత్ ఆతిథ్యమిచ్చింది.  హాకీ ప్రపంచకప్ కు ఇన్నిసార్లు ఆతిథ్యమిచ్చిన దేశం మరోకటి లేదు. అంతేగాక వరుసగా రెండోసారి కూడా భారత్ లోనే టోర్నీ జరుగుతుండం విశేషం. 

గత ఎడిషన్ లో  బెల్జియం విశ్వవిజేతగా నిలిచింది. దీంతో బెల్జియం ఈ టోర్నీలో  డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నది.  భారత్ విషయానికొస్తే గత ఎడిషన్ లో   క్వార్టర్స్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన టీమిండియా.. ఇప్పుడు మాత్రం కప్పుకొట్టాలనే పట్టుదలతో ఉంది. భారత జట్టు.. చివరిసారి 1975లో  కప్ నెగ్గింది.  ఆ తర్వాత 47 ఏండ్లు కావస్తున్నా భారత్ కు  నిరాశే ఎదురవుతున్నది. 

హాకీ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి  టోర్నీని రెండు వేదికలలో నిర్వహిస్తున్నారు.  అంతకుముందు  జరిగిన ప్రతీ  టోర్నీలో ఒకే వేదికలో మ్యాచ్ లను నిర్వహించేవారు. 

ఫార్మాట్ ఇలా : హాకీ ప్రపంచకప్ - 2023లో 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు గ్రూప్ లుగా విడిపోయిన ఈ జాబితాలో భారత్.. పూల్ - డిలో ఉంది. ఈ గ్రూప్ లో ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్ లు కూడా ఉన్నాయి. షెడ్యూల్ లో భాగంగా.. ప్రతి పూల్ లోని జట్టు.. మిగతా మూడు జట్లతో  ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పూల్ లో టాప్ నిలిచిన జట్టు  క్వార్టర్స్ కు చేరుతుంది. నాలుగు పూల్స్ నుంచి నాలుగు జట్లు క్వార్టర్స్ కు చేరతాయి. కాగా ఒక్కో పూల్ లో  రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు క్రాస్ ఓవర్స్ లో మరో పూల్ జట్లతో నాకౌట్ మ్యాచ్ లలో  ఆడతాయి. అందులో నుంచి మరో నాలుగు జట్లు క్వార్టర్స్ కు చేరనున్నాయి. తర్వాత సెమీస్, ఫైనల్స్ ఉంటాయి. 

click me!