ఇలాంటి ఆటగాళ్లు శతాబ్దానికొక్కరే ఉంటారు.. మిస్టర్ 360పై కపిల్ దేవ్ ప్రశంసలు

First Published Jan 9, 2023, 2:59 PM IST

శ్రీలంకతో ఇటీవలే ముగిసిన మూడో  టీ20లో వీరబాదుడు బాది   తన కెరీర్ లో మూడో సెంచరీ  సాధించిన సూర్యపై  మాట్లాడటానికి తనకు మాటలు రావడం లేదని.. ఇటువంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారని.. 

ఏడాదిన్నర కాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్న టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ పై  భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన  కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు.  సూర్య వంటి ఆటగాళ్లు దశాబ్దానికి ఒక్కరు మాత్రమే ఉంటారని  కొనియాడాడు. 

శ్రీలంకతో ఇటీవలే ముగిసిన మూడో  టీ20లో వీరబాదుడు బాది   తన కెరీర్ లో మూడో సెంచరీ (112)  సాధించిన సూర్యపై  మాట్లాడటానికి తనకు మాటలు రావడం లేదని  కపిల్ దేవ్ అన్నాడు.  కపిల్ మాట్లాడుతూ..‘కొన్నిసార్లు సూర్య ఆటను చూసి నాకు మాటలు రావు.  శ్రీలంకతో అతడు ఆడిన మూడో టీ20 మ్యాచ్ కూడా అలాంటిదే. మనం సచిన్ టెండూల్కర్ ను చూశాం. రోహిత్, కోహ్లీల ఆటనూ చూశాం. 

అయితే వాళ్లు ఆట చూసేప్పుడు వీరిని భర్తీ చేయగల  ఆటగాడు భవిష్యత్ లో  ఆ జాబితాలో కచ్చితంగా చేరతాడని భావిస్తాం. అలా  ఉండే ఆటగాళ్లలో తప్పకుండా ఉండే పేరు   సూర్యకుమార్ యాదవ్. భారత్ లో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. కానీ సూర్య స్టైలే వేరు. 

అతడు ఆడే  క్రికెట్.. ముఖ్యంగా క్రీజులో దిగాక  ఫైన్ లెగ్ మీదుగా సూర్య ఆడే షాట్ బౌలర్లను భయపెడుతుంది. క్రీజులో ఉన్నచోటు నుంచే మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్లు కొట్టడంలో అతడు దిట్ట.  అది బౌలర్లకు మరింత భయంకరంగా  అనిపిస్తుంది.  

నేను నా కెరీర్ లో చాలా మంది గొప్ప బ్యాటర్లను చూశాను. ఆట నుంచి నిష్క్రమించిన తర్వాత  కూడా చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు వచ్చి వెళ్లారు. వివిన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, ఏబీ డివిలియర్స్ వంటి  ఆటగాళ్లు బంతిని  చాలా క్లీన్ గా కొట్టగలరు.   ఆ జాబితాలో కచ్చితంగా ఉండే ఆటగాళ్లలో సూర్య ఒకడు.  సూర్య వంటి ఆటగాడు  శతాబ్దానికి ఒకడు   మాత్రమే ఉంటాడు..’అని ప్రశంసలు కురిపించాడు. 

శ్రీలంకతో మూడో టీ20 లో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన   సూర్య.. తర్వాత 19 బంతులలోనే మిగతా యాభై పరుగులు చేశాడు. సూర్య మెరుపులతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. తర్వాత లంక..   137 పరుగులకే ఆలౌట్ అయింది.  ఫలితంగా భారత్..  91 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. 

click me!