టీమిండియాలోకి ఇప్పుడు చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో ఔత్సాహిక క్రికెటర్లకు తెలుసు. దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు చేసినా జాతీయ జట్టులోకి అవకాశం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఐపీఎల్ పుణ్యమా అని ఆ లీగ్ లో మెరిసినా జాతీయ జట్టులో రాణించక తిరిగి మళ్లీ దేశవాళీకే పరిమితమైనవాళ్లూ ఉన్నారు.
అయితే ఒకసారి కుదురుకుని.. వరుసగా మెరుగైన ప్రదర్శనలతో నిలకడగా ఆడితే మాత్రం వారికి తిరుగుండదు. అలా వచ్చిన వారిలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకడు. గడిచిన ఏడాది కాలంగా అత్యంత భీకరమైన ఫామ్ లో ఉన్న సూర్య తాజాగా టీ20 ప్రపంచకప్ లో రాణిస్తున్నాడు.
సూర్య ఆటపై పాకిస్తాన్ మాజీ సారథి, ఆ జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలందించిన షాహిద్ అఫ్రిది తాజాగా స్పందించాడు. భారత ఆటగాళ్ల మాదిరిగా పాకిస్తాన్ క్రికెటర్లు దేశవాళీలో రాణించడం తక్కువని.. సూర్య ఆట చూస్తేనే అది అర్థమవుతుందని చెప్పాడు.
పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తన గేమ్ ప్లాన్ ను మార్చుకోనని, అలా చేస్తే ప్రత్యర్థులకు తాను దొరికిపోతానని త్వరగా ఔట్ అవ్వాల్సి వస్తుందని కామెంట్స్ చేశాడు. దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ కు చెందని సామా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. ‘అవును. వాళ్లు (ఇండియా) జాతీయ జట్టులోకి రాకముందు కనీసం రెండు వందల వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి వస్తారు.
జాతీయ జట్టులోకి రాకముందు సూర్య కూడా వందలాది దేశవాళీ మ్యాచ్ లు ఆడి అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. తన ఆటేంటో అతడికి తెలుసు. మంచి బంతులను కూడా షాట్లు ఆడగల సమర్థుడు అతడు. ఎందుకంటే ఇంతకముందే దేశవాళీలో అతడు అలాంటి షాట్లు వందలాదిగా ఆడి ఉంటాడు.
టీ20లలో ఒకే తీరుగా ఆడుతానంటే కుదరదు. ఆటకు తగ్గట్టుగా మనను మనం మలుచుకోవాలి. కొత్త షాట్లను ఆడాలి...’అని రిజ్వాన్ కు చురకలంటించాడు. ఈ టోర్నీ కి ముందు రిజ్వాన్, సూర్య ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడ్డారు. కానీ సూర్య నిలకడగా రాణించి నెంబర్ వన్ కు చేరుకోగా రిజ్వాన్ మాత్రం వరుసగా విఫలమై విమర్శల పాలవుతున్నాడు.