సెమీస్ మ్యాచ్‌కు ముందు ఇండియా- ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్.. హిట్ మ్యాన్‌తో పాటు అతడికీ గాయం..?

First Published | Nov 8, 2022, 11:39 AM IST

T20 World Cup 2022: టీ20  ప్రపంచకప్ లో సెమీస్ కు ముందు భారత-ఇంగ్లాండ్ జట్లకు భారీ షాక్ తాకింది.  టీమిండియా సారథి హిట్ మ్యాన్ కు గాయమైనట్టు సమాచారం. అలాగే ఇంగ్లాండ్ నుంచి కూడా.. 

సూపర్-12ను దాటుకుని సెమీస్ కు చేరుకున్న భారత, ఇంగ్లాండ్ జట్లకు  మెగా పోరు ముందు  భారీ షాక్ లు తప్పేట్లు లేవు.  ఇరు జట్లకు గాయాలు వేధిస్తున్నాయి. భారత జట్టు సారథి  రోహిత్ శర్మ  మోచేయికి గాయమైనట్టు తెలుస్తున్నది. 

సెమీస్ మ్యాచ్ కోసం రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి  కుడి మోచేయికి  బంతి బలంగా తాకినట్టు జట్టు మేనేజ్మెంట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.  దీంతో హిట్ మ్యాన్ ఇబ్బందిపడ్డాడు. వెంటనే స్పందించిన సిబ్బంది.. అతడికి చికిత్సను అందించింది. అయితే  చికిత్స తర్వాత రోహిత్ మళ్లీ బ్యాటింగ్ చేయలేదు.  


కొంతసేపు విరామం తర్వాత  తిరిగి  నెట్స్ కు వచ్చిన రోహిత్  మళ్లీ బ్యాట్ పట్టాడని టీమ్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. గాయం ఇక్కడితో   తగ్గిపోతే ఏ ఇబ్బంది ఉండదు గానీ మ్యాచ్ టైమ్ వరకు తిరగబెడితే మాత్రం అతడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆడేది అనుమానమే.  

ఒకవేళ హిట్ మ్యాన్ ఆడకుంటే  అది భారత్ కు భారీ లోటే. ప్రస్తుతానికి ఫామ్ లో లేకున్నా టీ20లలో రోహిత్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. తనదైన రోజున ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను కూడా  ఉతికి ఆరేయగల  సమర్థుడు హిట్ మ్యాన్. మరి ఈనెల 10 న జరుగబోయే సెమీస్ కు అందుబాటులో ఉంటాడో లేదో అన్నదానిపై  పూర్తి స్పష్టత  రావాల్సి ఉంది. 

ఇక ఇంగ్లాండ్ జట్టు  స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ కూడా ప్రస్తుతం గాయంతో సతమతమవుతున్నాడు. ఇటీవలే శ్రీలంకతో ముగిసిన మ్యాచ్ లో  మలన్ కు గజ్జల్లో గాయమైంది.  దీంతో అతడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు కూడా రాలేదు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడని, ఇండియాతో మ్యాచ్ కు అందుబాటులో ఉండడని  సోమవారం మోయిన్ అలీ తెలిపాడు. 

Latest Videos

click me!