ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ వన్ మిడిలార్డర్ బ్యాటర్ అతడే.. సూర్యా భాయ్‌పై పాక్ మాజీ సారథుల ప్రశంసలు

First Published | Oct 31, 2022, 5:56 PM IST

T20 World Cup 2022: టీ20 ఫార్మాట్ లో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో  ముగిసిన మ్యాచ్ లో  మిగిలిన బ్యాటర్లంతా విఫలమైనా  అతడు మాత్రం నిలదొక్కుకుని రాణించాడు. 

టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుకు తొలి ఓటమిని పరిచయం చేసిన దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో మిగిలిన బ్యాటర్లంతా విఫలమైన చోట సూర్యకుమార్ యాదవ్ కదం తొక్కాడు.  పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సఫారీ బౌలర్లు  రెచ్చిపోతున్నా.. తన సహచరులను ఔట్ చేసిన బౌలర్లను  ముప్పు తిప్పలు పెడుతూ హాఫ్ సెంచరీతో భారత్  గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో  విజయవంతమయ్యాడు. 

సూర్య ప్రదర్శనపై భారత క్రికెట్ వర్గాల నుంచే గాక  పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.  పాక్ జట్టు మాజీ సారథులుగా పనిచేసిన మిస్బా ఉల్ హక్, షోయభ్ మాలిక్ లు  సూర్య ఆటకు మంత్రముగ్దులయ్యారు. పాకిస్తాన్ లోని ‘ఎ స్పోర్ట్స్’ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 


Misbah ul Haq

మిస్బా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం టీ20  క్రికెట్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ మిడిలార్డర్ బ్యాటర్ సూర్య. 170 స్ట్రైక్ రేట్ తో  దక్షిణాఫ్రికాతో అటువంటి పరిస్థితుల్లో (49కే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో).. అదీ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై కూడా సూర్య సఫారీ బౌలర్లను డామినేట్ చేసే ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇదంతా జరగాలంటే ఆట మీద మీకు చాలా గ్రిప్ ఉండాలి.  బంతి ఎక్కడ పడితే ఎలా కొట్టాలనే అవగాహన ఉండాలి. అది సూర్యకు కావాల్సినంత ఉంది..’ అని తెలిపాడు. ఇదే షోకు వచ్చిన షోయభ్ మాలిక్ కూడా  సూర్యపై ప్రశంసలు కురిపంచాడు.   సూర్య బౌలర్లతో మైండ్ గేమ్ ఆడతాడని కొనియాడాడు. 

Shoaib Malik

మాలిక్ స్పందిస్తూ.. ‘సూర్య తన ఆటను మార్చుకోడు. అదే అతడిని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా నిలబెడుతున్నది. ఏడాదికాలంగా నిలకడగా రాణించడానికి కూడా కారణమిదే.  వాస్తవానికి సూర్య పాకిస్తాన్ తో మ్యాచ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కానీ అతడు తన ఆటను మార్చుకోలేదు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాతో అదే దూకుడును కొనసాగించాడు. 

మ్యాచ్ పరిస్థితులను, బౌలర్ల మైండ్ సెట్ ను సూర్య బాగా అంచనావేస్తాడు. బౌలర్ బంతి వేయడానికంటే ముందే సూర్య అతడు  ఏ బంతి వేయబోతున్నాడు..? ఏ షాట్ ఆడాలి అనుకుంటాడు.. ప్రపంచ క్రికెట్ లో గతంలో ఇలా  దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేసేవాడు. ఇప్పుడు అది  సూర్య చేస్తున్నాడు..’ అని తెలిపాడు. 

Latest Videos

click me!