
Harshit Rana: టీమిండియా పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. ఇటీవల టీ20 సిరీస్ లో సూపర్ బౌలింగ్ తో తన ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన హర్షిత్ రాణా.. వన్డే సిరీస్ లో కూడా అదే ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్ తో భారత్ కు విక్టరీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
మూడు ఫార్మాట్లు.. తొలి భారత బౌలర్ గా హర్షిత్ రాణా రికార్డు
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడుతున్నాయి. దీనిలో భాగంగా తొలి మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ తొలి వన్డేలో హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. ఇక్కడ కూడా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
ఇదే సమయంలో అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా హర్షిత్ రాణా నిలిచాడు. తన వన్డే అరంగేట్ర ఇన్నింగ్స్‌లో హర్షిత్ రాణా 7 ఓవర్ల బౌలింగ్ లో 53 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ 7 ఓవర్లలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండటం విశేషం.
ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన హర్షిత్ రాణా
తొలి వన్డే మ్యాచ్ లో భారత్ విజయంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్.. హర్షిత్ రాణా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. తన మూడవ ఓవర్‌లో 26 పరుగులు చేసి చెత్త రికార్డును రాణా పేరుమీద వేశాడు. అయితే, వన్డే కెరీర్ సవాలుతో ప్రారంభం కాగా, ఆ తర్వాత హర్షిత్ రాణా తన బౌలింగ్ పదును చూపించాడు. మొదటి మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు కానీ, ఆ తర్వాత తన బౌలింగ్ పవర్ చూపించాడు. తర్వాతి 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.
టీ20లో శివం దూబే స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా
వన్డే ఎంట్రీకి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో T20Iలో శివమ్ దుబేకు బదులుగా హర్షిత్ భారత జట్టులోకి వచ్చాడు. ఇది అతనికి అరంగేట్రం మ్యాచ్. ఈ మ్యాచ్ లో కూడా సూపర్ బౌలింగ్ తో 3 వికెట్లు తీసి దుమ్మురేపాడు. 4-0-33-3 గణాంకాలను నమోదు చేశాడు.
దీనికి ముందు 2024-25లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్షిత్ రాణా టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇక్కడ కూడా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. రాణా మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
అద్భుతంగా అంతర్జాతీయ కెరీర్ ను మొదలుపెట్టిన హర్షిత్ రాణా
23 ఏళ్ల హర్షిత్ రాణా అంతర్జాతీయ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. ఇప్పటివరకు అతను రెండు టెస్టులు, ఒక టీ20, ఒక వన్డే మ్యాచ్ ను ఆడాడు. అతని టెస్ట్ రికార్డు 50.75 సగటుతో నాలుగు వికెట్లు ఉండగా, అందులో 3/48 అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.
ఒక టీ20 మ్యాచ్ లో 11.00 సగటుతో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వన్డే అరంగేట్రం మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. అతని లిస్ట్-ఏ కెరీర్ లో 14 మ్యాచ్‌లలో 23.45 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4/17 అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.