పాండ్యా చాలా కూల్ కెప్టెన్ అన్న లక్ష్మణ్.. ఐపీఎల్ చూడలేదా సార్..? అంటూ ఆడుకుంటున్న నెటిజన్లు

First Published Nov 17, 2022, 2:59 PM IST

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ   కివీస్ తో తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత  మూడు వన్డేలు ఆడుతుంది. ఈ పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తాడు. 

రోహిత్ శర్మ గైర్హాజరీలో  న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 ఫార్మాట్ లో భారత జట్టును నడిపిస్తున్నాడు  హార్ధిక్ పాండ్యా. రాహుల్ ద్రావిడ్ ఈ పర్యటనకు బ్రేక్ తీసుకోవడంతో  భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 18 నుంచి భారత జట్టు.. హార్థిక్ పాండ్యా సారథ్యంలో న్యూజిలాండ్ తో తలపడనుంది.  

టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చాలా కూల్ కెప్టెన్ అని కొనియాడాడు. వ్యూహాలపరంగానే గాక ఆన్ ది ఫీల్డ్ లో కూడా పాండ్యా చాలా కూల్ గా ఉంటాడని తెలిపాడు. 

లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘పాండ్యాలో నాయకత్వ లక్షణాలు  కలిగిన ఆటగాడు.  ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ   ఏం సాధించాడనేది దేశం మొత్తం చూసింది. తొలిసారి సారథ్య పగ్గాలు చేపట్టి  కప్ కొట్టడమనేది మామూలు విషయం కాదు. అది  అతడికి గొప్ప అచీవ్మెంట్.  

వ్యూహాల పరంగానే గాక పాండ్యా ఫీల్డ్  లో కూడా  కూల్ గా ఉంటాడు.   గొప్ప నాయకుల లక్షణం కూడా అదే..’అని కొనియాడాడు. అయితే లక్ష్మణ్  చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా  నెటిజన్లు ట్రోల్స్ కు దిగారు. లక్ష్మణ్ ఐపీఎల్ సరిగా చూడనట్టున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. 

లక్ష్మణ్ వ్యాఖ్యలపై పలువురు నెటిజనులు స్పందిస్తూ.. ‘అవునా.. ఫీల్డ్ లో లక్ష్మణ్ కూల్ గా ఉంటాడా..? మాకు తెలియదే.. ఈ విషయంలో మాకంటే ఎక్కువ మహ్మద్ షమీకి బాగా తెలుసు..’, ‘కూల్ కెప్టెనా..? లక్ష్మణ్ గారు మీరు అసలు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఆడిన మ్యాచ్ లను చూశారా..? లేదా..? చూడకుంటే మళ్లీ ఒకసారి చూడండి..’ 

‘అవును, హార్ధిక్ చాలా కామ్ గా ఉంటాడు. తన సీనియర్ క్రికెటర్లపై నోరు పారేసుకోడు..’ అని  కామెంట్స్ చేస్తున్నారు.  ఐపీఎల్ - 15లో భాగంగా  పాండ్యా.. షమీ, ఇతర సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిని దుర్బాషలాడటం  వంటివి అప్పట్లో పలు విమర్శలకు తావిచ్చాయి.  హార్ధిక్ పాండ్యా  తన సీనియర్లను గౌరవిండచం నేర్చుకోవాలని పలువురు సూచించిన విషయం తెలిసిందే.   కెప్టెన్ కాగానే ఎలా పడితే అలా ఉంటాననడం సరికాదని  అతడికి చురకలంటించారు.  

click me!