జొకోవిచ్‌కు భారీ ఊరట... లైన్ క్లీయర్ చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

First Published Nov 17, 2022, 1:25 PM IST

ప్రపంచ టెన్నిస్ వెటరన్  స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కు భారీ ఊరట దక్కింది.  ఈ ఏడాది ప్రారంభంలో  జొకోవిచ్  ను దూరంగా పెట్టిన దేశమే ఇప్పుడు  రా రమ్మని ఆహ్వానిస్తున్నది.   

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది అతడికి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ మినిస్టర్ ఆండ్రూ గైల్స్  ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.  సెర్బియా   ఆటగాడికి  స్వాగతం పలుకుతున్నామని తెలిపాడు. 
 

Image Credit: Getty Images

ఈ ఏడాది ఆరంభంలో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు  వచ్చాడు.  కానీ  కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా అతడికి ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. వ్యాక్సిన్ వేసుకోబోనని  జొకోవిచ్ మొండిపట్టు పడితే  వేసుకోకుంటే ఆడనిచ్చేదే లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

ఆస్ట్రేలియా ప్రభుత్వం - జొకోవిచ్ మధ్య  వ్యాక్సిన్ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. జొకో వీసాను ఆస్ట్రేలియా క్యాన్సిల్ చేసింది.  దీంతో   సెర్బియాతో పాటు ఇతరదేశాలలో కూడా జొకోవిచ్ కు మద్దతుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు  జరిగాయి.   ఎంత జరిగినా ఆసీస్ మాత్రం ‘తగ్గేదేలే..’ అన్నట్టుగా వ్యవహరించింది. దీంతో జొకోవిచ్ నిష్క్రమించక తప్పలేదు. 

ఇదిలాఉండగా  2023  గ్రాండ్ స్లామ్ కోసం స్వయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వమే జొకోవిచ్ ను ఆహ్వానించింది. ఇదే విషయమై గైల్స్ స్పందిస్తూ.. ‘ఈ ఏడాది జనవరిలో జొకోవిచ్ వీసాను క్యాన్సిల్ చేసిన తర్వాత కోవిడ్ కు సంబంధించిన నిబంధనలన్నీ ఎత్తివేశాం.  కరోనా వ్యాక్సిన్  సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. దీంతో అతడికి టెంపరరీ వీసా  ఏర్పాటు చేస్తున్నాం..’ అని తెలిపారు. 

గతంలో జొకోవిచ్ ఏకంగా 9 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గాడు. తాజా పరిణామాలపై జొకోవిచ్ మాట్లాడుతూ.. ‘ఈ విషయం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు భారీ ఊరట.  నేనే  కాదు..నాకుటుంబీకులు, ఫ్రెండ్స్ కూడా ఈ విషయం తెలియగానే చాలా ఆనందపడ్డారు.  ఈఏడాదికాలంగా  నా జీవితంలో చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కున్నా..’ అని చెప్పాడు. 

click me!