ఐదేండ్ల తర్వాత ఢిల్లీలో టెస్టు.. కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు బీసీసీఐ సన్నాహకాలు

First Published Nov 17, 2022, 2:12 PM IST

కరోనా కారణంగా వెలవెలబోయిన స్టేడియాలకు ఇప్పుడిప్పుడే జనసందోహం పోటెత్తుతున్నది. గడిచిన రెండేండ్లలో టెస్టు మ్యాచ్ లకు దూరంగా ఉన్న  దేశంలోని పలుస్టేడియాలు ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ లతో కళకళలాడనున్నాయి. 

ఢిల్లీలోని  అరుణ్ జైట్లీ స్టేడియంలో  టెస్టు మ్యాచ్ జరగక ఐదేండ్లు దాటిపోయింది. 2017లో  ఇక్కడ శ్రీలంకతో టెస్టు మ్యాచ్ తర్వాత మళ్లీ భారత జట్టు ఇక్కడ  టెస్టులు ఆడలేదు. ఈ ఐదేండ్ల కాలంలో ఐపీఎల్,  ద్వైపాక్షిక  సిరీస్ లలో భాగంగా టీ20లు, వన్డేలు ఆడినా టెస్టులకు మాత్రం ఢిల్లీ ఆతిథ్యమివ్వలేదు.

కానీ త్వరలోనే దేశ రాజధాని ప్రజలు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో  టెస్టు మజాను ఆస్వాదించనున్నారు. వచ్చే ఏడాది భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో ఇక్కడ టీమిండియా టెస్టు ఆడనున్నదని సమాచారం.  

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఆస్ట్రేలియా జట్టు  2023 ఫిబ్రవరి - మార్చిలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. ఇక్కడ కంగారూలు భారత్  తో నాలుగు టెస్టులు ఆడతారు. ఈ  సిరీస్ లో ఒక టెస్టును ఢిల్లీలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.   బహుశా  రెండో టెస్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగేఅవకాశమున్నదని తెలుస్తున్నది. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) -2021-23లో భాగంగా భారత్ ఆడబోయే చివరి టెస్టుసిరీస్ ఇదే కానున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే భారత్..కంగారూలను  4-0తో ఓడించాలి. ఈ నాలుగు టెస్టులలో భాగంగా ఓ టెస్టు మ్యాచ్ ను పింక్ బాల్  (డే అండ్  నైట్) టెస్టు గా నిర్వహించాలని  బీసీసీఐ భావిస్తున్నది. 

తొలి  టెస్టును ఎక్కడ నిర్వహించాలనేదానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నది.   ఇందుకుగాను నాగ్‌పూర్, హైదరాబాద్, చెన్నైలు పోటీ పడుతున్నాయి. ఈ మూడు వేదికలలో ఏదో ఒకటి ఖాయం కానున్నది. రెండో టెస్టు ఢిల్లీలో నిర్వహిస్తే మూడో టెస్టును ధర్మశాలలో నిర్వహించాల్సి ఉంది. చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్ లో జరిపేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. బహుశా అహ్మదాబాద్ టెస్టును పింక్ బాల్ టెస్టుగా నిర్వహిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. 

బీసీసీఐ గతంలో  ఈడెన్ గార్డెన్స్ లో (బంగ్లాదేశ్), మోతేరా (ఇంగ్లాండ్),బెంగళూరు (శ్రీలంక) లలో డేఅండ్ నైట్ టెస్టులను నిర్వహించింది. ఇక అహ్మదాబాద్ లోనే మరోసారి  పింక్ బాల్ టెస్టును నిర్వహించనుంది.  2021లో  కరోనా విజృంభించినా భారత్.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో నాలుగు, న్యూజిలాండ్, శ్రీలంకలతో తలా రెండు టెస్టులను నిర్వహించిన విషయం తెలిసిందే.

click me!