ఆ రోజు హార్ధిక్ పాండ్యా, టీమిండియాని గెలిపించగలనని అనుకున్నాడు... ఆ రనౌట్ తర్వాత...

First Published Oct 7, 2022, 2:30 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు తొలిసారిగా పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోయింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్స్ చరిత్రలో టీమిండియాకి పాక్ చేతుల్లో ఇదే తొలి ఓటమి. అయితే దీనికంటే ముందు భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని, టీమ్‌ని ఎక్కువగా వేధించిన ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాభవం.. టీమిండియాలో సంచలన మార్పులకు దారి తీసిన ఈ పరాభవం, అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణమైంది..

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 180 పరుగుల తేడాతో పాక్ చేతుల్లో చిత్తుగా ఓడింది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

రోహిత్ శర్మ డకౌట్ కాగా విరాట్ కోహ్లీ 5, శిఖర్ ధావన్ 22, యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోనీ 4, కేదార్ జాదవ్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి ఏడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి తన కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్‌పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది..

‘ఆ రోజు 6 వికెట్లు పడిన తర్వాత కూడా హార్ధిక్ పాండ్యా తానొక్కడే మ్యాచ్‌ని గెలిపించగలనని అనుకున్నాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు అలాగే బ్యాటింగ్ చేశాడు. తన జోన్‌లో ఫ్రీగా షాట్లు ఆడాడు...

జడేజాతో తాను కలిసి మ్యాచ్‌ని ఫినిష్ చేయగలమని నమ్మాడు. అనుకోని ఆ రనౌట్ తర్వాత అంతా మారిపోయింది. పాండ్యా, జడేజా ఇద్దరూ చాలా ఫీల్ అయ్యారు. అయితే ఆ ఇన్నింగ్స్ హార్ధిక్ పాండ్యాని ప్రపంచానికి పరిచయం చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కుంబ్లే మీద కోపంతోనే టీమిండియా ఓడిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ పరాభవం, అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించడానికి కారణమైంది... 

click me!