ఆరు పడగానే అర్థమైపోయింది, అన్నీ అతనికేనని... అనిల్ కుంబ్లేపై హర్భజన్ సింగ్ కామెంట్స్...

First Published Aug 16, 2022, 6:31 PM IST

ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన అరుదైన ఫీట్ సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. టీమిండియా తరుపున 600లకు పైగా వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఉన్న అనిల్ కుంబ్లే, పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి చరిత్ర లిఖించాడు...

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 420 పరుగుల లక్ష్యఛేదనతో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్‌ని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు అనిల్ కుంబ్లే. తొలి వికెట్‌కి షాహిద్ ఆఫ్రిదీ, సయ్యద్ అన్వర్ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో 101/0 స్కోరు కార్డుతో భారత జట్టును ఓడించేలాగే కనిపించింది పాకిస్తాన్. అయితే ఆ తర్వాత అనిల్ కుంబ్లే మ్యాజిక్ స్పెల్‌తో వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 208 పరుగులకి ఆలౌట్ అయ్యి, 212 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మరోసారి తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అనిల్ కుంబ్లే రికార్డు ఫీట్ గురించి తన అభిప్రాయాన్ని, అనుభవాన్ని పంచుకున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

‘అనిల్ కుంబ్లే భయ్యా 10 వికెట్లు తీసిన మ్యాచ్‌లో నేను కూడా ఆడాను. ఆ మ్యాచ్‌లో మొట్టమొదటిసారి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినందుకు నేను సంతోషించా. 10 వికెట్లు తీయడమంటే మామూలు విషయం కాదు...

అతను 6 వికెట్లు తీయగానే నాకు సీన్ అర్థమైపోయింది, ఈ మ్యాచ్‌లో నాకు ఒక్క వికెట్ కూడా పడదని... అన్ని వికెట్లు అనిల్ భయ్యాకే పడతాయని.. అతనికే పడాలని కూడా అనుకున్నా...

టీమిండియాకి ఆడిన గ్రెటెస్టు క్రికెటర్లలో అనిల్ భాయ్ కూడా ఒకరు. ఆయన గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్. చాలామంది అనిల్ కుంబ్లే బంతిని స్పిన్ చేయడని విమర్శించేవాళ్లు. అయితే హృదయం ఉంటే బంతిని స్పిన్ చేయకపోయినా వికెట్ తీయవచ్చని అనిల్ భాయ్ నిరూపించారు...

అనిల్ కుంబ్లే చేసిన దాంట్లో సగం సాధించినా అతను ఛాంపియన్‌ ప్లేయరే. అనిల్ భాయ్‌తో కలిసి ఆడే అవకాశం దక్కడం నా అదృష్టం.. ఆయన కమిట్‌మెంట్ చూస్తే మెంటల్ వచ్చేస్తది. ఆట కోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్...

click me!