దానికోసం దాదా ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు.. స్పష్టతనిచ్చిన లెజెండ్స్ లీగ్ క్రికెట్

First Published | Aug 16, 2022, 5:43 PM IST

Independence Day Special Match: భారత 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇండియా వర్సెస్ రెస్టాఫ్ ది వరల్డ్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. 

టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) లో భాగంగా దాదా..  సెప్టెంబర్ 15న జరుగబోయే మ్యాచ్ లో ఆడబోతున్నాడు.  భారత 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ  మ్యాచ్ ఇండియా వర్సెస్ రెస్టాఫ్ ది వరల్డ్ మధ్య జరుగనున్నది. 

అయితే ఈ మ్యాచ్ కోసం గంగూలీకి భారీ మొత్తంలో ముట్టజెప్పుతున్నారని సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆరోపణలను ఎల్ఎల్‌సీ  సీఈవో రమన్ రహేజా ఖండించాడు.  ఈ మ్యాచ్ కోసం గంగూలీకి తాము నయా పైసా చెల్లించడం లేదని తెలిపాడు.  


రహేజా మాట్లాడుతూ.. ‘లేదు. అవి తప్పుడు ఆరోపణలు. ఈ మ్యాచ్ కోసం  గంగూలీ   ఒక్క  పైసా కూడా తీసుకోవడం లేదు.  భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు  పూర్తయిన సందర్భంగా బీసీసీఐ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నది. ఇది చారిటీ మ్యాచ్ కాదు...’ అని  తెలిపాడు. 

కాగా ఎల్ఎల్‌సీ వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానుండగా అంతకంటే రెండ్రోజుల ముందే ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.  భారత జట్టును ‘ఇండియా మహారాజాస్’ అని పిలుస్తుండగా రెస్టాఫ్ ది వరల్డ్ టీమ్ కు ‘వరల్డ్ జెయింట్స్’ అని పేరు పెట్టారు. ఇండియా మహారాజాస్ కు  దాదా సారథ్యం వహిస్తుండగా.. వరల్డ్ జెయింట్స్ కు ఇయాన్ మోర్గాన్ సారథిగా ఉన్నాడు. 

ఇండియా మహారాజాస్:  సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్జాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి 

వరల్డ్ జెయింట్స్ :  ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండి సిమన్స్, షేన్ వాట్సన్ జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్),  నాథన్ మెక్ కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హమిల్టన్ మసకద్జ, మష్రఫీ మొర్తజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్దిన్ (వికెట్ కీపర్) 

Latest Videos

click me!