టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవబోతున్న పంత్..

First Published Jan 31, 2023, 6:41 PM IST

Rishabh Pant:  నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో  తీవ్ర గాయాలపాలైన  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని  కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

గతేడాది డిసెంబర్ 30న  తన తల్లిని సర్ప్రైజ్ చేయడానికి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తూ మార్గమధ్యంలో   కారు డివైడర్  కు ఢీకొనడంతో  తీవ్ర గాయాలపాలైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  కోలుకుంటున్నాడు.  ప్రస్తుతం అతడికి బీసీసీఐ.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో  వైద్యం అందిస్తోంది.  

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. పంత్  మోకాలికి  వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారని, మరో వారం రోజుల్లో అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని  తెలుస్తున్నది.  పంత్ వేగంగా కోలుకుంటున్నాడని,  ఈ వారంలోనే అతడిని డిశ్చార్చి  చేసే అవకాశం ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు కూడా తెలిపాయి.  

ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘పంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి కూడా  మంచి రిపోర్టులు వస్తున్నాయి.  అతడి మోకాలికి చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది.  అన్నీ కుదిరితే ఈవారంలోనే అతడు  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి   అవుతాడు. పంత్ ఆరోగ్యం గురించి బీసీసీఐ .. నిత్యం  వైద్యులతో టచ్ లోనే ఉంటున్నది.  

పంత్ ప్రస్తుతానికి కోలుకున్నా అతడికి మార్చిలో మరో సర్జరీ అవసరం పట్టొచ్చు.   అయితే అది ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.  ఆ తర్వాత పంత్ కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటాడు.. త్వరలోనే అతడు కోలుకోవాలని ఆశిస్తున్నాం..’అని తెలిపాడు. 

ఇదిలాఉండగా  ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసినా  పంత్ కోలుకోవడానికి ఆరు నుంచి 8 నెలలు సమయం పట్టవచ్చునని   సమాచారం.  ఈ నేపథ్యంలో పంత్..  ఏప్రిల్ లో జరిగే  ఐపీఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (భారత్ క్వాలిఫై అయితే), వెస్టిండీస్ టూర్ తో పాటు ఆసియా కప్ కూడా మిస్ అవుతాడు. అక్టోబర్ వరకు కోలుకుంటే భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడతాడు. లేదంటే అందులో ఆడేదీ అనుమానమే.. 

పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో  పాటు టీమిండియా క్రికెటర్లు కూడా  వేడుకుంటున్నారు. ఇటీవలే భారత్ - న్యూజిలాండ్ మధ్య  ఇండోర్  వేదికగా రెండో వన్డే జరుగగా ఆ మ్యాచ్ కు ఒక్క రోజు ముందు టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉజ్జయిని ఆలయానికి వెళ్లి పంత్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. 

click me!