
Gongadi Trisha: అద్భుతమైన ఆటతో ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 ట్రోఫీని భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. మలేషియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా మహిళల జట్టు సౌతాఫ్రికా మహిళల జట్టులో తలపడింది. భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రోటీస్ జట్టును చిత్తుచేసింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ వరుసగా రెండోసారి గెలుచుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని మరో 52 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. 11.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి విక్టరీని అందుకుంది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షో
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీని గమనిస్తే తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షో కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శనతో గొంగడి త్రిష భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టింది.
భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంతో మన తెలుగమ్మాయి గొంగడి త్రిష పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ టోర్నీ ఆరంభం నుంచి బ్యాట్, బాల్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడింది. ఫైనల్ మ్యాచ్ లో గొంగడి త్రిష 33 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి భారత జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు త్రిష బౌలింగ్ లో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన గొంగడి త్రిష
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 లో అద్భుతమైన ఆటతో ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చారు గొంగడి త్రిష. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడి భారత్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడంతో తనదైన ముద్రవేశారు.
టోర్నీ మొత్తంగా తిరుగులేని ప్రదర్శనలు చేసిన గొంగడి త్రిష ఈ ఐసీసీ టోర్నీలో 7 మ్యాచ్ లను ఆడిన మొత్తంగా 309 పరుగులు, 7 వికెట్లు తీసుకున్నారు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ ఐసీసీ టోర్నమెంట్ లో గొంగడి త్రిష "ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు"ను గెలుచుకున్నారు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 44* పరుగులు, 3 వికెట్లు తీసుకుని భారత్ కు విజయాన్ని అందించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా త్రిష నిలిచారు.
ఎవరీ గొంగడి త్రిష?
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టడంతో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసు నుంచే తండ్రి ఆమెను క్రికెట్ ఆడటం నేర్పించారు. కేవలం తొమ్మిదేళ్ల వయసులో ఆమె హైదరాబాద్ అండర్-16 జట్టులో చోటుదక్కించుకున్నారు.
సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన గొంగడి త్రిష అద్భుతమైన ఆటతో ఆ తర్వాత అండర్-23 కూడా ఆడింది. త్రిష తన సక్సెస్ క్రెడిట్ తన తండ్రికి దక్కుతుందని చెప్పారు. ఎందుకంటే గంటల తరబడి వారితో కష్టపడి పనిచేస్తాడు, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. మలేషియాలో జరిగిన ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపి భారత్ టైటిల్ గెలవడంతో తనదైన ముద్ర వేశారు.
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025: టీమిండియా ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా
ICC అండర్-19 మహిళల T20i ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా నిలబడలేకపోయింది. త్రిష గొంగడి 3 వికెట్లు తీసుకున్నారు. ఆమెకు తోడుగా పరునికా సిసోడియా, ఆయూసి శుక్లా, వైష్ణవి శర్మలు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
83 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ కేవలం 1 వికెట్ కోల్పోయి 11.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది. భారత వికెట్ కీపర్ జీ కమలిని (8 పరుగులు) త్వరగానే ఔట్ అయినప్పటికీ గొంగడి త్రిష 44* పరుగులు, సానికా చాల్కే 26* పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించారు. బ్యాట్, బాల్ తో రాణించిన త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నారు.