మళ్లీ ముదురుతున్న వివాదం.. వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌కు రాబోమన్న పాక్ చీఫ్ పై గంభీర్ కామెంట్స్

First Published Nov 27, 2022, 6:56 PM IST

వచ్చే ఏడాది పాకిస్తాన్ తో జరగాల్సి ఉన్న ఆసియా కప్ కు భారత్ హజరుకాకుంటే తాము కూడా ఇండియా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడబోమని పీసీబీ  చీఫ్ రమీజ్ రాజా  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. అయితే అక్కడ భద్రతా కారణాలు, దాయాది దేశంతో సరిహద్దు వివాదాలతో భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లబోదని, తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టీమిండియా ఆడుతుందని  కొద్దిరోజుల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)  అధ్యక్షుడు  జై షా కామెంట్స్  చేసిన విషయం తెలిసిందే. 

రెండ్రోజుల క్రితం  జై షా వ్యాఖ్యలకు కౌంటర్ గా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనం. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం...

భారత జట్టు, ఇక్కడికి వస్తే, మేం అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే మేం లేకుండానే వరల్డ్ కప్ జరుపుకోవచ్చు... మేం రాకపోతే వన్డే వరల్డ్ కప్ మ్యాచులను ఎవరు చూస్తారు...’ అని అన్నాడు. అంతేగాక.. ‘పాక్ క్రికెట్ బోర్డు ఎవ్వరికీ భయపడదు.  2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించడం... ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా భారత జట్టును చిత్తు చేశాం.

ఒకే ఏడాది గ్యాప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్, బిలియన్ డాలర్ ఎకానమీ టీమ్‌ని రెండు సార్లు ఓడించింది. పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా. 

దీనికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కరెక్ట్ సమయం కోసం వేచి చూడండి. వరల్డ్ క్రికెట్‌లో ఇండియా ఓ అత్యున్నత శక్తి. ఇండియాని ఏ దేశం కూడా డామినేట్ చేయలేదు. మేం పాకిస్తాన్‌కి వెళ్లబోం, కానీ వాళ్లు వన్డే వరల్డ్ కప్ ఇక్కడికి వచ్చి తీరతారు... కావాలంటే రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది...’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 

తాజాగా ఈ వివాదంపై  టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్  ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘ఇది రెండు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి చర్చించుకోవాల్సిన విషయం. బీసీసీఐ, పీసీబీలు కలిసి చర్చించుకుని  దీనిమీద ఒక నిర్ణయానికి రావాలి..’ అని అన్నాడు. రాను రాను ఈ వివాదం మరెంత ముదురుతుంది..?  అసలు ఆసియా కప్ కోసం భారత్ పాక్ కు వెళ్తుందా..? అలా జరుగకుంటే పాకిస్తాన్.. వన్డే వరల్డ్ కప్ ఆడటానికి భారత్ కు వస్తుందా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది. 

click me!