ఐపీఎల్ ఫైనలా మజాకా.. గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్న బీసీసీఐ.. ప్రపంచ రికార్డు సొంతం..

First Published Nov 27, 2022, 6:13 PM IST

Guinness World Record: ఈ ఏడాది  మేలో  ముగిసిన ఐపీఎల్ ఫైనల్  మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ  మ్యాచ్ కు ఏకంగా లక్షకు పైగా అభిమానులు హాజరై గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించేందుకు దోహదపడ్డారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో  ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ ఏడాది మే లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల  నరేంద్ర మోడీ స్టేడియంలో   బీసీసీఐ నిర్వహించిన ఐపీఎల్ ఫైనల్  మ్యాచ్ చరిత్రలో  సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఈ మ్యాచ్ కు హాజరైన ప్రేక్షకుల  సంఖ్య  ఇప్పుడు ప్రపంచ రికార్డును నెలకొల్పింది.  

మే 29న జరిగిన ఐపీఎల్-2022  ఫైనల్  మ్యాచ్ కు నరేంద్ర మోడీ స్టేడియానికి  1,01,566 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి  అవార్డును కూడా అందజేశారు.  

టీ20 మ్యాచ్ లో ఇంతమంది హాజరవడం ఇదే ప్రథమం.  గతంలో ఉన్న రికార్డులన్నింటీనీ  ఈ మ్యాచ్ బద్దలుకొట్టింది.  ఈ మేరకు  బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.   బీసీసీఐ తన ఖాతాలో స్పందిస్తూ.. ‘ఇండియాకు ఇది గర్వకారణం. భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇది మా  అభిమానులకు అంకితం.. మోతేరా, ఐపీఎల్ కు అభినందనలు..’ అని  రాసుకొచ్చింది. 
 

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి  ప్రశంసా పత్రం అందుకున్న బీసీసీఐ సెక్రటరీ జై షా తన ట్విటర్ లో ఇదే విషయాన్ని పంచుకుంటూ.. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్నందకు గర్వంగా ఉంది. ఐపీఎల్ ఫైనల్ లో 1,01, 566 మంది ఒక టీ20 మ్యాచ్ కు హాజరైనందుకు గాను ఇది సాధ్యమైంది. దీనికి క్రెడిట్ మా అభిమానులకే..’ అని ట్వీట్ చేశాడు. 

గతంలో మోతేరా స్టేడియం (తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం అని పేరు మార్చారు) సీటింగ్ కెపాజిటీ 49వేలు మాత్రమే ఉండేది. కానీ  స్టేడియం రెనోవేషన్ తర్వాత  దానిని లక్షా 32వేలకు పెంచారు.  ఇదిలాఉండగా వచ్చే ఏడాది ఇదే వేదికలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరుగనుందని సమాచారం. ఒకవేళ భారత్ గనక ఫైనల్ చేరితే  1,32,000 సీట్లు నిండటం ఖాయం. అప్పుడు అది మరో ప్రపంచ రికార్డు  సృష్టించడం ఖాయం.  

ఇక ఐపీఎల్-2022 ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ .. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది.  లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్..  18.1 ఓవర్లలోనే ఛేదించి  తమ తొలి సీజన్ లోనే ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ లో హార్ధిక్ బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మ్యాచ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. 

click me!