మూడో వన్డేలో అలా జరిగితే వన్డే సిరీస్ గోవిందా! పాండ్యా గ్యాంగ్‌కు మేలు చేసిన వరుణుడు ధావన్ సేనకు హ్యాండ్ ఇస్తే

First Published Nov 27, 2022, 5:23 PM IST

India vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు  ఫీల్డ్ లో కంటే  డ్రెస్సింగ్ రూమ్ లలోనే ఎక్కువగా గడుపుతున్నది.  వర్షం పుణ్యమా అని ఈ పర్యటనలో భారత జట్టు పూర్తిస్థాయి ఆట ఆడింది  రెండు మ్యాచ్ లలో మాత్రమే. 

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత యువ భారత్ నేరుగా   ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇక్కడ టీమిండియా..  మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కివీస్ కు వచ్చింది. అయితే ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్ ను భారత్ 1-0తో దక్కించుకోగా  వన్డే సిరీస్ లో మాత్రం కివీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. 

మూడు వన్డే సిరీస్ లలో భాగంగా  రెండ్రోజుల క్రితం  ఆక్లాండ్ లో ముగిసిన తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ లో రాణించినా బౌలింగ్ లో విఫలమైంది. కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ సెంచరీతో పాటు  సారథి కేన్ విలియమ్సన్  సూపర్ బ్యాటింగ్ తో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.  

అయితే రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని భావించిన ధావన్ సేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటింగ్ కు వచ్చి నాలుగు ఓవర్లు కూడా పూర్తికాకముందే వర్షం అంతరాయం కలిగించింది. తిరిగి కొద్దిసేపటికి వర్షం తగ్గినా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. మళ్లీ రెండోసారి మ్యాచ్ మొదలయ్యాక  భారత స్కోరు 89-1గా (12.5 ఓవర్లు) వద్ద ఉండగా  వరుణుడు మళ్లీ  కురిశాడు. ఈసారి వాన ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ అర్థాంతరంగా రద్దైంది. 

ఈ మ్యాచ్ రద్దు కావడంతో  ఈనెల 30 న క్రిస్ట్‌చర్చ్ లో  జరుగబోయే మూడో వన్డే ఇరు జట్లకూ కీలకం కానున్నది. ఈ మ్యాచ్  ఓడినా.. వర్షం వల్ల రద్దు అయినా న్యూజిలాండ్ కు పోయేదేం లేదు.   కానీ భారత్ కు మాత్రం  సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. రెండో వన్డే మాదిరిగా వర్షం అంతరాయం కలిగిస్తే భారత్ కు షాకే. 

ఈ పర్యటనలో భారత్ కు టీ20 సిరీస్ సందర్భంగా వరుణుడు మేలు చేశాడు. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా రెండో టీ20లో మాత్రం అఖండ విజయం సాధించింది. కానీ మూడో టీ20లో టీమిండియా  161 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.  ఆ సమయానికి కివీస్ బౌలర్లు మంచి  ఊపు మీదున్నారు. 

వాన రాకుండా మరో వికెట్ పడుంటే  ఆ మ్యాచ్ లో ఫలితం భారత్ కు ప్రతికూలంగానే వచ్చేది. కానీ  వర్షం వల్ల మ్యాచ్ టై అయింది. దీంతో భారత్  1-0తో  సిరీస్ గెలిచింది.  సిరీస్ విజయం సందర్భంగా వరుణుడు మనకు మేలే చేశాడని టీమిండియా ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడ్డారు. 

Image credit: PTI

కానీ వన్డే సిరీస్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. నవంబర్ 25న ఆక్లాండ్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.   లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి  309 పరుగులు చేసింది. 
 

ఆదివారం అర్థాంతరంగా ముగిసిన రెండో వన్డేలో  ఫలితం తేలకపోవడంతో భారత్ సిరీస్ లో వెనుకబడింది. మరో మ్యాచ్ మాత్రమే మిగిలున్న ఈ సిరీస్ లో క్రిస్ట్ చర్చ్ లో కూడా వర్షం పడే అవకాశాలే ఉన్నాయి.  ఒకవేళ అదే జరిగి మ్యాచ్ రద్దైతే మాత్రం వరుణుడు ధావన్ సేనకు షాక్ ఇచ్చినట్టే. ఈ నేపథ్యంలో గెలుపో ఓటమో గానీ మ్యాచ్ సజావుగా సాగాలని ధావన్ సేనతో పాటు భారత జట్టు అభిమానులు  కోరుకుంటున్నారు. 

click me!