కూలిన స్టాండ్.. విరిగిన కుర్చీలు.. గాలేలో వర్ష బీభత్సానికి స్టేడియం అతలాకుతలం

First Published Jun 30, 2022, 3:44 PM IST

Galle Test: గత కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన శ్రీలంక పై ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపుతున్నది.  గాలే వేదికగా జరుగుతున్న శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు లో  భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. 

ఆర్థిక సమస్యలతో నిండా మునిగిన ద్వీప దేశం శ్రీలంక కు ప్రకృతి మరో షాకిచ్చింది. అసలే ఆర్థిక మాంద్యంతో ఉన్న వనరులతో పరిస్థితులను నెట్టుకొస్తున్న లంక క్రికెట్ బోర్డుపై ప్రకృతి ఊహించని దెబ్బకొట్టింది. 

గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. మొదటి టెస్టు రెండో రోజు ఆటలో దాదాపు రెండున్నర సెషన్ల ఆట వర్షార్పణం అయింది. అయితే ఆట పోయిందానికంటే  ఎక్కువ బాధ లంకకు మరొకటుంది. 

గాలే లో రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు  హోరుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో స్టేడియం అంతా  అతలాకుతలమైంది. ఓ స్టాండ్ రూఫ్ అక్కడికక్కడే కూలిపోయింది.   అదృష్టవశాత్తూ అది కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇక స్టేడియంలో ఉన్న  కుర్చీలు గాలివానకు దిక్కుకొకటిగా ఎగిరిపోయాయి. స్డేడియంలోని పెవిలియన్ అద్దాలు పగిలిపోయాయి.  ఇది శ్రీలంక క్రికెట్ కు కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే దేశంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా డే అండ్ నైట్ మ్యాచ్ లను నిర్వహించడానికి కరెంట్, జనరేటర్ కూడా లేకపోవడంతో డే లో వాటిని ఆడించారు. ఇక తాజాగా గాలేలో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఆ దేశ బోర్డు ఖజానాకు మరింత బొక్క పడ్డట్టే.. 

ఇక గాలేలో రెండో రోజు సుమారు లంచ్ తర్వాత  ఆట ప్రారంభమైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 59 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. 47 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (38 నాటౌట్), అలెక్స్  కేరీ (30 నాటౌట్) క్రీజులో ఉన్నారు.   

click me!