Rohit Sharma: బద్దకస్తుడి నుంచి భారత కెప్టెన్ దాకా.. టీమిండియా వన్డే సారథి రోహిత్ జర్నీలో ఎన్నో మలుపులు..

First Published Dec 9, 2021, 1:06 PM IST

India ODI Captain: నాటకీయ పరిణామాల మధ్య భారత వన్డే సారథ్య బాధ్యతలను చేపట్టిన రోహిత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆరేండ్ల పాటు జట్టులోకి రావడం.. పోవడం హిట్ మ్యాన్ కు రొటీన్ గా మారింది. కానీ...!

‘పరమ బద్దకస్తుడు..’ ‘వికెట్ల మధ్య పరిగెత్తలేడు..’ ‘ఫుట్ వర్క్ అస్సలు లేదు, క్రికెట్ కు  పనికిరాడు..’ ‘జట్టులోకి రావడం పోవడంతోనే సరిపోతుంది. ఇంక ఫామ్ సంగతి చూసుకునే తీరిక ఎక్కడిది..?’ ఇవీ రోహిత్ శర్మ  భారత జట్టులోకి వచ్చినప్పుడు వినిపించిన కామెంట్లు. 

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి సుమారు ఆరేండ్ల పాటు రోహిత్ శర్మ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అసలు జట్టులో ఉంటాడో ఉండడో గ్యారెంటీ లేదు. అందుకు అనుగుణంగానే రోహిత్.. వరుస వైఫల్యాలతో సెలెక్టర్లకు కూడా విసుగు  తెప్పించేవాడు.  

2007 లోనే  భారత జట్టులోకి  ప్రవేశించినా.. దాదాపు 2013 దాకా రోహిత్ శర్మ జట్టులో ఉంటాడా..? ఉండడా..? అనేది అగమ్య గోచరమే. ఎక్కడో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగే రోహిత్ శర్మ.. ఓ మ్యాచ్ లో ఆడితే పది మ్యాచుల దాకా పేలవ ఫామ్ ను కొనసాగించేవాడు. 

కానీ కాల చక్రం గిర్రున తిరిగింది. అసలు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికే నానా కష్టాలు పడ్డ క్రికెటర్.. నేడు భారత జట్టుకు పరిమిత ఓవర్లలో సారథ్యం వహిస్తున్నాడు. అసలు బ్యాటింగ్ కు పనికివస్తాడా..? అని విమర్శలు చేసినవాని నోళ్లను మూడు డబుల్ సెంచరీలతో మూయించిన ఈ హిట్ మ్యాన్ జర్నీలో ఎన్నో మలుపులు. 

2007లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ కెరీర్.. 2013 దాకా పాము, నిచ్చెన ఆటలా ఉండేది. ఒక మ్యాచులో రెచ్చిపోయి ఆడటం.. తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమవడం.. మళ్లీ జట్టులోకి రావడం.. ఆరేండ్ల పాటు ఇదే కథ. కానీ భారత  మాజీ సారథి మహేంద్ర సింగ్ వల్ల రోహిత్ కెరీర్ స్వరూపమే మారింది. 

2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ను శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు పంపడంతో రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతకుముందే ఐపీఎల్ లో అడపాదడపా  మెరిసినా.. రోహిత్ కెరీర్ అతడు ఓపెనర్ అవడానికి ముందు.. తర్వాత గానే చెప్పుకుంటారు అతడి అభిమానులు. 

2013 కు ముందు 80 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ సగటు 30 లోపే. అందులో రెండు సెంచరీలతో కలిపి 2 వేల పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ..  తుది జట్టులో స్థానం నిలుపుకోవడానికి చాలా కష్టపడేవాడు. ఇక 2012లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో అయితే  రోహిత్.. 5 వన్డేలలో 13 పరుగులే చేశాడు. 

కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని.. హిట్ మ్యాన్  దృక్పథాన్నే మార్చాడు. ఇక ఆ తర్వాత అంతా చరిత్రే. శిఖర్ ధావన్ తో కలిసి చాలా మ్యాచుల్లో భారత్ కు సాలిడ్ ఓపెనింగ్స్ ఇచ్చాడు.  ధోని సారథ్యంలోనే రోహిత్..  రెండు డబుల్ సెంచరీలు  కూడా చేశాడు.

2011 లో ఐపీఎల్  లో డక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు మారిన రోహిత్ శర్మ.. 2013లో ఆ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.  అదే ఏడాది ముంబైకి కప్ కూడా అందించాడు.  ఆ తర్వాత కూడా 2015, 2017, 2019, 2020 లలో  ముంబైకి టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 

వన్డేలలో  విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా మంచి రికార్డే ఉన్నా.. ఐసీసీట్రోఫీలలో మాత్రం ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇక ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ ముంబైకి ఐదు టైటిళ్లు అందిస్తే.. విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా అందివ్వలేదు.  

ఐసీసీ ఈవెంట్ల విషయానికొస్తే 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ లోనే ఇంటి బాట పట్టిన టీమిండియా.. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అయితే సెమీస్ కూడా చేరలేదు. ఇక ఈ టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్.. సౌతాఫ్రికా తో జరుగబోయే సిరీస్ కు ముందు వన్డే  నాయకుడిగా కూడా స్థానం కోల్పోయాడు.  టీ20 కెప్టెన్ గా తప్పుకున్నా.. 2023 ల వరకు వన్డే కెప్టెన్ గా కొనసాగాలని కోహ్లీ భావించాడు. కానీ బీసీసీఐ మాత్రం అతడికి ఆ అవకాశమివ్వలేదు. 

ఇక వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ తో పాటు 2023 లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్ ను పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంచేందుకే బీసీసీఐ.. రోహిత్ కు పరిమిత ఓవర్ల బాధ్యతలను గంపగుత్తగా అప్పగించింది. మరి  ఈ హిట్ మ్యాన్ భారత జట్టుకు మూడో ప్రపంచకప్ తీసుకొస్తాడా..? ఐసీసీ ఈవెంట్లలో భారత్ ను విజేతగా నిలుపుతాడా..? అనేది కాలమే నిర్ణయించాలి. 

click me!