కళ్లు మూసి తెరిచేలోపు అలా జరిగిపోయింది, ఆ రోజు మేమంతా... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

First Published Dec 9, 2021, 12:38 PM IST

విరాట్ కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు అద్వితీయ విజయాలను అందుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లలో విజయాలు అందుకుంది. మాజీ కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. అయితే వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆడిలైడ్ పరాజయం ఎవ్వరూ ఊహించనిది...

ఆడిలైడ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగుల ఆధిక్యం దక్కింది. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు, స్వదేశంలో ప్రత్యర్థికి ఆధిక్యాన్ని అందించడం ఇదే తొలిసారి...

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మరో 150+ పరుగులు చేస్తే భారత జట్టుదే విజయం అనుకున్నారంతా. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీషా 4 పరుగులకే అవుట్ కావడంతో 7/1 వద్ద మూడో రోజు ఆటను ముగించింది భారత జట్టు. అయితే నాలుగో రోజు ఉదయం సెషన్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

నైట్‌వాచ్‌మెన్‌గా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వెళ్లిన బుమ్రాను కమ్మిన్స్ అవుట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనానికి ఏ దశలోనూ బ్రేక్ పడలేదు. భారత జట్టులో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా డబుల్ డిజిల్ స్కోరు అందుకోలేకపోయారు.

పృథ్వీషా 4, మయాంక్ అగర్వాల్ 9, జస్ప్రిత్ బుమ్రా 2, విరాట్ కోహ్లీ 4, హనుమ విహారి 8, వృద్ధిమాన్ సాహా 4 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యారు...

ఉమేశ్ యాదవ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మహ్మద్ షమీ గాయపడడంతో రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో 36/9 పరుగుల వద్ద భారత జట్టు ఇన్నింగ్స్‌కి తెరపడింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు...

‘కోచ్ పదవి ఎప్పుడూ నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంటుంది. అదో వింత జాబ్. ఎప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చినా, స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.. తప్పుకోవడానికి, తప్పు నాది కాదని చెప్పడానికి మార్గాలు ఉండవు...

36 పరుగులకే ఆలౌట్ అయిన ఆడిలైడ్ టెస్టు, నా కోచ్‌ కెరీర్‌లో అత్యంత దారుణమైన, అవమానకరంగా ఫీల్ అయిన రోజు. అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. ఆట మొదలైన 45 నిమిషాల్లోనే 36 పరుగులకు ఆలౌట్ అయ్యాం. ఫలితం వాళ్లు 90 పరుగులు చేస్తే చాలు, విజయం వారిదే...

ఏం జరుగుతుందో గ్రహించేలోపే అంతా జరిగిపోయింది. మేమంతా మొద్దుబారిపోయాం. ఆ మూడు రోజులు షాక్‌లోనే ఉన్నాం. అసలు ఇది ఎలా అయ్యిందా అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాం...

అది నా ఒక్కడి వల్ల కాలేదు. అయితే ఆ పరాజయానికి పూర్తి బాధ్యత నేనే తీసుకోవాలని అనుకున్నాం. దాక్కోడానికి అవకాశం కూడా లేదు. అందుకే ఆ టెస్టును మరిచిపోయి, మిగిలిన మ్యాచులపై ఫోకస్ పెట్టాలని చెప్పా...

అయితే జట్టు అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. 36 పరుగులకే ఆలౌట్ అయిన నెల రోజుల తర్వాత, జనవరి 19న గబ్బాలో టెస్టు సిరీస్ గెలిచాం... విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్... ఇలా కీ ప్లేయర్లు దూరమైన సిరీస్ గెలవగలిగాం..

నేనిప్పటికీ అదే నమ్మలేకపోతున్నా. ఆడిలైడ్ టెస్టు తర్వాత ఎలా కమ్‌బ్యాక్ ఇవ్వగలిగాం? ఒక్కటైతే చెప్పగలను, భారత క్రికెట్ ఉన్నంతవరకూ ఈ సిరీస్ విజయం గురించి మాట్లాడుకుంటారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి..

click me!