రైతులకు సాయం అందించే ‘ద్రోణి’ని లాంచ్ చేసిన ధోని..

First Published Oct 10, 2022, 6:01 PM IST

Dhoni Launches Droni: భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరు మీద ఏకంగా ఓ డ్రోన్ తయారైంది.   వ్యవసాయంలో రైతులకు ‘సాయం’ అందించేందుకు గాను  ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ  గరుడ ఏరోస్పేస్ సరికొత్త డ్రోన్ ను తయారుచేసింది. 
 

టీమిండియా మాజీ   సారథి,  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని.. డ్రోన్ల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ప్రముఖ  డ్రోన్ల తయారీ సంస్థ  గరుడ ఏరోస్పేస్  తయారుచేస్తున్న స్వదేశీ డ్రోన్ల తయారీలో ధోని పెట్టుబడులు పెట్టాడు. ఈ ఏడాది జూన్ లో ధోని ఈ సంస్థంలో  ఇన్వెస్ట్ చేశాడు. 

తాజాగా ఈ సంస్థ.. ‘ద్రోణి’ అనే పేరుతో ఓ  కెమెరా డ్రోన్ ను తీసుకొచ్చింది. ద్రోణిని నేడు చెన్నైలోని ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  గరుడ ప్రతినిధులతో పాటు ధోని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 

Latest Videos


ధోని పేరు మీదే తయారు చేసిన ఈ ద్రోణి..  వ్యవసాయంలో రైతులకు సాయం చేయనున్నది. మందుల పిచికారిని ఇది సమర్థవంతంగా నిర్వర్తించనుంది. రోజుకు సుమారు 30 ఎకరాలలో నిరాటంకంగా ఈ డ్రోన్ మందులు పిచికారి చేయనున్నది. 
 

వ్యవసాయంలోనే గాక సోలార్ ప్యానెల్ క్లీనింగ్, ఇండస్ట్రియల్ పైప్ లైన్ నిర్వహణ, మ్యాపింగ్, సర్వేలు, పబ్లిక్ అనౌన్స్మెంట్స్, డెలివరీ సర్వీసెస్ లో ఈ డ్రోన్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని  గరుడ ప్రతినిధులు తెలిపారు.  ఈ ఏడాది చివర్లో   ద్రోణిని మార్కెట్ లోకి తీసుకువస్తామని చెప్పారు.  ఈ డ్రోన్ బ్యాటరీతో పని చేయనున్నది. 

ఇదిలాఉండగా ద్రోణి ప్రారంభోత్సవంలో ధోని మాట్లాడుతూ..  కోవిడ్ లాక్డౌన్ సమయంలో తాను వ్యవసాయం చేశానని, ఈ రంగంలో ద్రోణి అద్భుత ఫలితాలు సాధిస్తుందని నమ్ముతున్నట్టు చెప్పాడు. వ్యవసాయంలో సాంకేతికత పెరగాల్సిన అవసరమున్నదని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ధోని.. గరుడకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం. 

click me!