కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు..! కోహ్లీ రిటైర్మెంట్‌పై నోరు పారేసుకుంటున్న పాక్ మాజీలు

Published : Sep 15, 2022, 03:36 PM IST

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మూడేండ్లుగా  ఫామ్ కోల్పోయి ఇటీవలే ఆసియా కప్ లో  తిరిగి మునపటి లయను అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్న అతడు..  ఇప్పటివరకు రిటైర్మెంట్ గురించి ఏ ప్రకటనా చేయలేదు. 

PREV
19
కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు..! కోహ్లీ రిటైర్మెంట్‌పై నోరు పారేసుకుంటున్న పాక్ మాజీలు

ఒకప్పుడు అవలీలగా  శతకాలు బాదిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. గడిచిన మూడేండ్లుగా  దాని ఊసే మరిచాడా..? అన్నట్టు  1,020 రోజుల తర్వాత  ఇటీవలే ఆసియా కప్ లో  అఫ్గానిస్తాన్ పై సెంచరీ చేయడమే గాక మునపటి ఫామ్ ను అందుకున్నాడు. ఆసియా కప్ లో  కోహ్లీ ఆట అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  

29

అయితే కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు గానీ.. అసలు బ్యాటింగ్ చేయడానికే ఇబ్బందిపడ్డప్పుడు గానీ  భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు ఇక్కడి  భారత సీనియర్ క్రికెటర్లు, మాజీలు, క్రికెట్ పండితులు, విశ్లేషకులు, విమర్శకులలో ఒక్కరు కూడా  అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని ఒక్క మాట అనలేదు. కోహ్లీ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని.. తర్వాత మళ్లీ ఫీల్డ్ లోకి దిగితే కోహ్లీ అద్బుతాలు చేస్తాడని అంతా ఆశించారు.  కోహ్లీని తరుచూ విమర్శించేవాళ్లు సైతం ఆ ఊసే ఎత్తలేదు. 

39

కానీ పాకిస్తాన్  మాజీ క్రికెటర్లు మాత్రం అలా కాదు.  వాళ్లు ఒక అడుగుకు ముందుకేసి అతి తెలివి ప్రదర్శిస్తూ అబాసుపాలు అవుతున్నారు. కోహ్లీ రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని.. ఇక అతడు  టీ20 క్రికెట్  కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని  ఉచిత సలహాలిస్తున్నారు. ఈ జాబితాలో  షోయభ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీలు  ముందున్నారు.  

49

రెండ్రోజుల క్రితం అఫ్రిది ఓ పాకిస్తాన్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘పేలవ ఫామ్ తో రిటైర్మెంట్ ఇస్తే  ఎవరూ గుర్తించరు.  కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రిటైర్ అయితేనే గౌరవం ఉంటుంది. ఇలా కొంతమంది మాత్రమే చేస్తారు..  ఆ జాబితాలో కోహ్లీ కూడా ఉంటాడని ఆశిస్తున్నా.. అద్భుత కెరీర్ ను కొనసాగించిన కోహ్లీ.. ఫామ్ లో ఉన్నప్పుడే వైదొలుగుతాడని  భావిస్తున్నా..’ అని వ్యాఖ్యానించాడు.

59

ఇక షోయభ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20ల నుంచి రిటైర్  అయితే మంచిది. తన కెరీర్ ను పొడిగించుకోవాలంటే కోహ్లీ..  టీ20ల నుంచి వైదొలిగి టెస్టు, వన్డే ఫార్మాట్ పై దృష్టి సారించాలి..’ అని చిలుక పలుకులు  పలికాడు.  

69

మరి ఈ పాక్ మాజీలు చెప్పినట్టు కోహ్లీ రిటైర్మెంట్ కు దగ్గరయ్యాడా..?   అంటే అస్సలు దానికి సమాధానం చెప్పడం కష్టం. తీరిక లేని క్రికెట్ తో అలిసిపోయాడేమో గానీ..   కోహ్లీ రిటైర్మెంట్  ప్రస్తావన భారత క్రికెట్ లో గానీ, కోహ్లీ ఫ్యాన్స్ లో గానీ లేదు.   

79

ప్రస్తుతం కోహ్లీ వయసు 33 ఏండ్లు. టీమిండియాలోకి వచ్చిన యువక్రికెటర్లతో పోల్చినా కోహ్లీ ఫిట్నెస్ లో అందరికంటే ముందుంటాడు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో గానీ.. ఫీల్డ్ లో చిరుతలా కదలడంలో గానీ కోహ్లీ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. ఇక ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ ఆట చూస్తే కోహ్లీ ఇప్పుడప్పుడే టీ20ల నుంచి రిటైర్ అయ్యే  అవకాశాల్లేవని తెలుస్తూనే ఉంది.  

89

కోహ్లీ ఆట, వయసు, ఫిట్నెస్ పరంగా చూస్తే మరో నాలుగైదేండ్లు అతడు క్రికెట్ ఆడటం  అసలు విషయమే కాదు. తనంత తానుగా వైదొలిగితే తప్ప కోహ్లీని జట్టు నుంచి తొలగించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మరి పాక్ మాజీలకు కోహ్లీ రిటైర్మెంట్ గురించి అంత తొందరెందుకని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

99

ఇప్పటికే అమిత్ మిశ్రా వంటి సీనియర్ క్రికెటర్లు అఫ్రిది వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అందరూ నీలాగా  నాలుగైదు సార్లు రిటైర్ అవ్వరు.  నువ్వు కోహ్లీ సంగతి పక్కనబెట్టి నీ పని చూస్కో..’ అని  కామెంట్స్ చేస్తూ పాకిస్తాన్ ఆటగాళ్ల గూబ గుయిమనిపిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories