Tim Paine: ఇక చాలు.. విరామం తీసుకుంటా..! ముప్పేట దాడితో క్రికెట్ కు స్వస్తి చెప్పనున్న ఆస్ట్రేలియా మాజీ సారథి?

First Published Nov 26, 2021, 12:15 PM IST

Ashes: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుని అనూహ్యంగా ఆసీస్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ఆ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్... క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడా..? తాజాగా అతడి మేనేజర్ ప్రకటన చూస్తే అదే అనుమానం కలగక మానదు.

ఆస్ట్రేలియా టెస్టు జట్టు  మాజీ సారథి టిమ్ పైన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా..? త్వరలో ఇంగ్లాండ్ తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టుల తర్వాత పైన్.. క్రికెట్ కు వీడ్కోలు పలుకనున్నాడా..? ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇదే చర్చనీయాంశం. 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుని యాషెస్ సిరీస్ కు ముందు అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి  తప్పుకుంటున్నట్టు ప్రకటించిన టిమ్ పైన్.. తాజాగా చేసిన  ప్రకటన.. ఇక అతడు క్రికెట్ కు స్వస్తి పలికినట్టే అనే చెప్పకనే చెబుతున్నది. 

తాజాగా ట్విట్టర్ వేదికగా టిమ్ పైన్ మేనేజర్ స్పందిస్తూ..‘మానసిక కారణాల వల్ల పైన్ అన్ని ఫార్మాట్ల నుంచి విరామం తీసుకోబోతున్నాడు. కొన్నాళ్లు అతడు క్రికెట్ కు దూరంగా ఉంటాడు..

అతడి భార్య, కుటుంబం కూడా మానసికంగా చాలా కుంగిపోయి ఉంది. దీంతో అతడికి విశ్రాంతి అత్యావశ్యకం..’ అని ట్వీట్ చేశాడు. దీని గురించి కామెంట్ చేయడానికి ఇంకేమీ లేదంటూ అతడు ట్వీట్ లో ముగించాడు. 

ప్రస్తుతం టిమ్ పైన్ వయసు 36 ఏండ్లు. దీంతో ఈ ట్వీట్ తో అతడు క్రికెట్ కు వీడ్కోలు చెప్పినట్టేనని  ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

యాషెస్  సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన జట్టులో టిమ్ పైన్ సారథ్య బాధ్యతలతో పాటు  వికెట్ కీపర్ కూడా ఉన్నాడు.  

కానీ తన సహోద్యోగిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పైన్.. ఆసీస్ సారథిగా తప్పుకున్నాడు. అయితే జట్టులో మాత్రం కొనసాగుతానని చెప్పాడు.  దీంతో అతడితో పాటు పైన్ పై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియాపై కూడా ముప్పేట దాడి జరిగింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో టిమ్ పైన్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.  రెండు టెస్టులకు ఇప్పటికే జట్టును ప్రకటించిన  తరుణంలో.. ఆ తర్వాత సెలెక్షన్ కు పైన్ కు విరామం ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. మరి  తొలి రెండు టెస్టుల తర్వాత  పైన్ ఏదైనా ప్రకటన చేస్తాడా..? లేక తర్వాత తీరిగ్గా  చేస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలాఉండగా..  సారథిగా పైన్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఆసీస్  ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ భర్తీ చేయనున్నాడు.  ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని కెప్టెన్సీ కోల్పోయిన  స్టీవ్ స్మిత్.. వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 8 నుంచి తొలి టెస్టు మొదలుకానున్నది. 

click me!