6 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు... టీమిండియా ఈ పరిస్థితికి కారణమెవ్వరు? బీసీసీఐ లేదా విరాట్ కోహ్లీ...

First Published Jul 1, 2022, 10:34 AM IST

2022 ఏడాది ప్రారంభమై 6 నెలలు ముగిశాయి. ఈ ఆరు నెలల్లో టీమిండియాకి ఆరుగురు కెప్టెన్లు మారిపోయారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో  2022లో టీమిండియాకి కెప్టెన్సీ చేయబోతున్న ఆరో సారథిగా నిలిచాడు... టీమిండియా చరిత్రలోనే ఒకే ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు మారడం ఇదే తొలిసారి...

1959లో భారత జట్టు ఐదుగురు కెప్టెన్లను వాడింది. సెలక్టర్లు, బీసీసీఐ ఛైర్మెన్‌గా ఉన్న లాలా అమర్‌నాథ్ మధ్య విభేదాల కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో గులాం అహ్మద్, మనోహర్ హర్ధికర్, పోలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్, హేము అధికారి... రూపంలో ఐదుగురు కెప్టెన్లను వాడింది భారత జట్టు. అప్పట్లో ఇది భారత ప్రభుత్వం, పార్లమెంట్ స్వయంగా కల్పించుకుని భారత క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు కారణమైంది...
 

Jasprit Bumrah

మళ్లీ 63 ఏళ్ల తర్వాత భారత జట్టు ఆరు నెలల్లోనే ఆరుగురు కెప్టెన్లను వాడడం విశేషం. ఏడాది లెక్క తీసుకుంటే జూన్ 2021 నుంచి జూన్ 2022 వరకూ భారత జట్టుకి కెప్టెన్లుగా వ్యవహరించిన వారి లెక్క 8 మంది... 

KL Rahul-Virat Kohli

గత ఏడాది జూన్‌లో లంకలో పర్యటించిన జట్టుకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌కి కూడా సారథిగా వ్యవహరించాడు.  

సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది భారత జట్టు. ఈ సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, రెండు జట్లను క్లీన్ స్వీప్ వరుసగా 15 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు..

Image credit: PTI

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ వ్యవహరించగా ఐర్లాండ్‌లో పర్యటించిన మరో జట్టుకి హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరించాడు.. తాజాగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.  
 

టీమిండియాకి ఈ పరిస్థితి రావడానికి బీసీసీఐయే కారణమని కొందరు అంటుంటే, విరాట్ కోహ్లీయే కారణమని మరికొందరు వాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో విరాట్ గాయం కారణంగా ఆడని మ్యాచుల సంఖ్య కేవలం నాలుగే...

Image credit: PTI

అలాంటి విరాట్ కోహ్లీ పట్ల బీసీసీఐ వ్యవహరించిన విధానం సరిగా ఉండి ఉంటే, టీమిండియాకి ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. టెస్టులు, వన్డేల్లో విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే, టీ20ల్లో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే సరిపోయేదనేది వారి వాదన...

మరికొందరు టీమిండియా పరిస్థితికి విరాట్ కోహ్లీయే కారణమంటున్నారు. భారత మాజీ సారథి ఎమ్మెస్ ధోనీ, తన వారసుడిగా విరాట్ కోహ్లీని తయారుచేశారు. విరాట్ మాత్రం తన తర్వాత కెప్టెన్సీ చేయగల సత్తా ఉన్న యంగ్ ప్లేయర్‌ను కనిపెట్టలేకపోయాడనేది వారి వాదన.. 

click me!