టీమిండియా సెలక్షన్ కమిటీపై వేటు వేయడానికి కారణాలివే... కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు...

First Published Nov 19, 2022, 11:46 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే నిష్కమించింది. 9 ఏళ్లుగా టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి కారణాలు వెతికే పనిలో పడిన బీసీసీఐ, ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. ఛీఫ్ సెలక్షన్ చేతన్ శర్మతో పాటు నలుగురు సెలక్షన్ కమిటీ సభ్యులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది...

సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన ఈ సెలక్షన్ కమిటీని రోజర్ భిన్నీ, భారత క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే తొలగించడం విశేషం. పాత సెలక్షన్ కమిటీ స్థానంలో కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది భారత క్రికెట్ బోర్డు...

చేతన్ శర్మ సెలక్షన్ కమిటీపై వేటు వేయడానికి ప్రధానంగా ఐదు కారణాలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన విరాట్ కోహ్లీ, కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ నిర్ణయం భారత క్రికెట్ టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఏడాదిలో 8 కెప్టెన్లను మార్చింది సెలక్షన్ కమిటీ. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్... ఇలా సిరీస్‌కో కెప్టెన్‌ని నియమిస్తూ వెళ్లింది. ఫలితంగా భారత జట్టులో సమతుల్యం దెబ్బతింది...
 

ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌ నుంచే ఇంటిదారి పట్టిన టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ నుంచే నిష్కమించింది. అంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే ఇంటిదారి పట్టిన భారత జట్టు, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది...

Prithvi Shaw-Chetan Sharma

టీ20 వరల్డ్ కప్ 2021, 2022 టోర్నీలకు ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2022లో ఒక్క టీ20 కూడా ఆడని కెఎల్ రాహుల్, నేరుగా ఆసియా కప్ టోర్నీలో బరిలో దిగాడు. సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లను సెలక్షన్ కమిటీ అస్సలు పట్టించుకోలేదు....

Image credit: Chetan SharmaInstagram

దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లు... టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కి జట్టుని ప్రకటించిన తర్వాత పృథ్వీ షా, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లు... సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు...  ఇది కూడా సెలక్షన్ కమిటీపై వేటు పడడానికి ఓ కారణంగా మారింది...

వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్లతో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లకు రెండు సిరీస్‌లకోమారు విశ్రాంతి ఇస్తూ వస్తోంది టీమిండియా. ఫలితంగా భారత జట్టు ఏడాది కాలంలో స్థిరమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడలేకపోయింది. ఇది టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో టీమిండియా పర్ఫామెన్స్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది...
 

Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, దీపక్ చాహార్... ఇలా కీలక ఆటగాళ్లు టీమిండియాకి ఎంపికైన తర్వాత గాయపడ్డారు. వీరు గాయపడడానికి కారణాలేంటి? అనే విషయంపై సెలక్షన్ కమిటీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఈ కారణాల వల్లే టీమిండియా మేనేజ్‌మెంట్, చేతన్ శర్మ  ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ చేతకానిదని తేల్చి... వేటు వేసింది...

Rahul Tripathi

వచ్చే కొత్త సెలక్షన్ కమిటీకి చేయాల్సిన పనుల విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. అందుబాటులో ఉన్న ప్లేయర్లతో బెస్ట్ టీమ్‌ని ఎంపిక చేయాల్సి ఉంటుందని, రిజర్వు బెంచ్‌ని దృఢంగా మార్చాలని స్పష్టం చేసింది. సెలక్షన్ చేసిన తర్వాత పనైపోయిందని చేతులు దులుపుకోకుండా దేశవాళీ టోర్నీలు, అంతర్జాతీయ మ్యాచులను వీక్షించి... ప్లేయర్ల ప్రదర్శనను సమీక్షించాల్సి ఉంటుంది...

టీమ్ సెలక్షన్ అయిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయకుండా మీడియాతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓ ప్లేయర్‌ని ఎందుకు సెలక్ట్ చేసింది? సదరు ప్లేయర్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేకపోయామనే విషయాలను వివరించాల్సి ఉంటుంది... అంటూ కొత్త సెలక్టర్ల బాధ్యతల గురించి వివరంగా రాసుకొచ్చింది బీసీసీఐ... 

click me!