అన్నంత పని చేసిన సంజూ శాంసన్ ఫ్యాన్స్.. టీమిండియా బస్సు వద్ద నిరసనలు

First Published Sep 27, 2022, 11:33 AM IST

Sanju Samson: దక్షిణాఫ్రికా తో మూడు టీ20లు ఆడేందుకు గాను  కేరళ చేరుకున్న రోహిత్ సేనకు సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఊహించని షాకిచ్చారు. త్రివేండ్రంలో టీమిండియా ప్లేయర్లకు స్వాగతాల కంటే శాంసన్ నినాదాలే ఎక్కువయ్యాయి. 
 

టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు సారథ్యం వహిస్తున్న సంజూ శాంసన్ ను దక్షిణాఫ్రికా సిరీస్ తో పాటు ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయనందుకు గుర్రుగా ఉన్న అతడి అభిమానులు అన్నంత పని చేశారు. 

ప్రపంచకప్ జట్టును విడుదల చేసిన తర్వాత బీసీసీఐ, సెలక్టర్ల మీద అసంతృప్తితో ఉన్న  సంజూ ఫ్యాన్స్.. తిరువనంతపురం టీ20లో తమ తడాఖా చూపిస్తామని ఇప్పటికే శపథాలు చేసిన విషయం విదితమే.   

రేపు తిరువనంతపురంలో జరుగబోయే తొలి టీ20లో  స్టేడియం వద్ద ఎలాంటి నిరసనలు చేస్తారో ఏమో గానీ.. అంతకుముందే త్రివేండ్రంలో  రోహిత్ సేనకు ఓ చిన్నపాటి ట్రైలర్ చూపించారు. త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో  దిగి  హోటల్ కు వెళ్లడానికి బయటకు వచ్చిన ఆటగాళ్లు వెళ్తున్న బస్సు వద్ద ‘సంజూ.. సంజూ’ అని నినదించారు. 

టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్  లు బస్సు ఎక్కేప్పుడు కూడా సంజూ అభిమానులు హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్ కు కొద్దిరోజుల ముందే కేరళలో సంజూ ఫ్యాన్స్.. తిరువనంతపురం టీ20లో నిరసన ప్రదర్శనలకు దిగాలని నిశ్చయించుకున్నారని  పోలీసులకు సమాచారం అందింది. అయితే ఎయిర్ పోర్టులోనే రచ్చ చేసిన సంజూ ఫ్యాన్స్.. మరి రేపటి మ్యాచ్ లో ఏం చేస్తారోననే అనుమానంతో పోలీసులు ఈ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇదిలాఉండగా  ప్రస్తుతం ఇండియా  ఏ  తరఫున న్యూజిలాండ్ ఏ తో ఆడుతున్న మ్యాచ్ లకు సంజూ శాంసన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు . మూడు వన్డేలకు గానూ  శాంసన్ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టు ఇదివరకే రెండు వన్డేలను గెలుచుకుంది. ఈనెల 25న చెన్నైలో ముగిసిన రెండో వన్డేలో న్యూజిలాండ్ తొలుత 47 ఓవర్లలో  219 పరుగులకే ఆలౌటైంది. తర్వాత టీమిండియా 34 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో శాంసన్.. 37 పరుగులు చేశాడు. 

click me!