ఇంగ్లాండ్ దూకుడుకి టీమిండియా కళ్లెం వేయగలదా... రోహిత్ శర్మ లేకపోతే భారత జట్టు పరిస్థితి ఏంటి?

First Published Jun 28, 2022, 11:11 AM IST

భారత్, ఇంగ్లాండ్ మధ్య సెప్టెంబర్ 2021లో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌... వాయిదా పడి జూలై 1న జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ 9 నెలల గ్యాప్‌లో అటు ఇంగ్లాండ్ జట్టులో, ఇటు టీమిండియాలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఐదో టెస్టుకి ముందు ఇంగ్లాండ్ అత్యంత బలంగా తయారవ్వడంతో టీమిండియా ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది...

నెల రోజులకి ముందు డబ్ల్యూటీసీ 2021 -23 సీజన్‌లో 12 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ని వరుసగా మూడు మ్యాచుల్లో చిత్తు చేసి... ఆఖరి పొజిషన్ నుంచి ఓ మెట్టు పైకి ఎక్కింది...

గత ఏడాది జూన్‌లో టీమిండియాని ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్, వరుసగా పరాజయాలతో 7వ స్థానానికి పడిపోయింది. 15 మ్యాచుల్లో 4 విజయాలు, 7 పరాజయాలు, 4 డ్రాలు అందుకున్న ఇంగ్లాండ్... డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమే..

అయితే ఫైనల్ చేరాలని ఆశపడుతున్న న్యూజిలాండ్, ఇండియా వంటి జట్ల ఆశలను నెరవేరకుండా చేయడం మాత్రం ఇంగ్లాండ్ చేతుల్లోనే ఉంది. జో రూట్ నుంచి టెస్టు కెప్టెన్సీ తీసుకున్న బెన్ స్టోక్స్, క్రిస్ సిల్వర్‌వుడ్ నుంచి టెస్టు కోచ్ పగ్గాలు అందుకున్న బ్రెండన్ మెక్‌కల్లమ్... ‘దూకుడే’ మంత్రంగా వరుస విజయాలు అందుకుంటున్నారు...

ఐదో టెస్టుకి ముందు టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం, ఫామ్‌లో ఉన్న బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయంతో టీమ్‌కి అందుబాటులో లేకుండా పోవడంతో టీమిండియా కష్టాలు రెట్టింపు అయ్యాయి... ఐదో టెస్టు సమయానికి రోహిత్ కోలుకోకపోతే, టీమిండియా ఈ టెస్టుపై ఆశలు వదులుకోవాల్సిందే..

విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు, ఛతేశ్వర్ పూజారా అంతర్జాతీయ సెంచరీ చేసి మూడేళ్లు కావస్తోంది. దీంతో ఐదో టెస్టుకి టీమిండియాకి ఇంగ్లాండ్‌కి గట్టి పోటీ ఇవ్వగలదా? అనేది అనుమానంగా మారింది. రోహిత్ శర్మ సమయానికి కోలుకోకపోతే ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని జస్ప్రిత్ బుమ్రా లేదా రిషబ్ పంత్‌లకు కెప్టెన్సీ పగ్గాలు అందుతాయి...

జోరు మీదున్న ఇంగ్లాండ్ టీమ్‌ దూకుడుని కొత్త కెప్టెన్సీలోని భారత జట్టు ఎంత వరకూ నియంత్రించగలదు? అనేది ఊహించడం కూడా కష్టమే. దీంతో రోహిత్ శర్మ త్వరగా కోలుకుని, టీమ్‌కి అందుబాటులోకి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు టీమిండియా అభిమానులు..

click me!