ఈనెల 22 నుంచి టీ20 ప్రపంచకప్ లో సూపర్-12కు మొదలుకానున్నది. నేటితో క్వాలిఫై ఆడే జట్ల విషయంలో స్పష్టత రానుంది. ఇదిలాఉండగా మెగా టోర్నీకి ముందు వివిధ జట్లు ఆటగాళ్ల ప్రదర్శన కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం గాయాలు. ఇదీ అదీ అనే తేడా లేకుండా దాదాపు ప్రతీ జట్టులో గాయాల బాధితులున్నారు.
ప్రపంచకప్ కు నెలరోజులు ముందే క్రికెట్ ఆడే దేశాలు మెగా టోర్నీలో ఆడబోయే సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. ఇందులో టీమిండియా నుంచి స్టార్ పేసర్ బుమ్రా ముందు జట్టులో చోటు దక్కించుకున్నా తర్వాత వెన్నునొప్పి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. రవీంద్ర జడేజా అంతకుముందే తప్పుకోవగా వారం రోజుల క్రితం దీపక్ చాహర్ దీ అదే పరిస్థితి.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ వాన్ డర్ డసెన్ గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ప్రపంచకప్ ప్రారంభానికి రెండు వారాల ముందు ఆల్ రౌండర్ ప్రిటోరియస్ కూడా ఇదే బాటలో పయనించాడు.
ఇక ప్రపంచకప్ ప్రారంభమయ్యక పలు జట్లకు చెందిన ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా శ్రీలంకకు కోలుకోలేని షాక్ లు తాకుతున్నాయి. నమీబియాతో మ్యాచ్ కు ముందు ఆ జట్టు యువ పేసర్ దిల్షాన్ మధుశంక ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత స్టార్ పేసర్ దుష్మంత చమీర కూడా యూఏఈతో మ్యాచ్ లో గాయపడ్డాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అతడు ఆడలేదు. మిగతా టోర్నీకి కూడా చమీర అందుబాటులో ఉంటాడా..? లేడా..? అన్నది అనుమానమే. ఈ ఇద్దరే గాక శ్రీలంక నుంచి దనుష్క గుణతిలక, ప్రమోద్ మధుషాన్ కూడా గాయాలతో బాధపడుతున్నారు.
ఇంగ్లాండ్ కూడా టీ20 జట్టును ప్రకటించిన కొద్దిసేపటికే జానీ బెయిర్ స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడటంతో అతడి పేరును తప్పించింది. తాజాగా ఆ జట్టు స్టార్ పేసర్ రీస్ టాప్లీ గాయపడ్డాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతడి కాలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం అతడు మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నాడని ఈసీబీ ప్రకటించింది. అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న ఇంగ్లాండ్ పేసర్ టైమల్ మిల్స్ ను తీసుకుంది.
ఈ ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియాకూ గాయాల బెడద తప్పడం లేదు. బుధవారం ఆ జట్టు వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ కూడా గాయపడ్డాడు. గోల్ప్ ఆడుతూ ఇంగ్లిస్ చేతికి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. శనివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఇంగ్లిస్ ఆడతాడో లేదో అనేదానిపై స్పష్టత లేదు.
న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ కూడా ఇటీవలే గాయపడి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్ లో ఆడటానికి చోటు దక్కించుకున్నా మిచెల్ తుది జట్టులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానమే..