సెహ్వాగ్ లాంటి ప్లేయర్ అక్కడ పుట్టి ఉంటేనా... అతని వల్లే వీరూ కెరీర్‌కి సరైన ముగింపు దక్కలేదా...

First Published | Oct 20, 2022, 11:08 AM IST

వీరేంద్ర సెహ్వాగ్, అరవీర భయంకర వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన బ్యాటర్. టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడిన వీరేంద్ర సెహ్వాగ్... టీమిండియా తరుపున టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్. అయితే వీరూకి కెరీర్ చివర్లో సరైన గౌరవం దక్కలేదు. సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి పరుగులు చేసిన వీరూ... ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా లేకుండానే రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది...

క్రీజులో పాటలు పడుతూ సిక్సర్లు బాదే వీరేంద్ర సెహ్వాగ్, ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌ని బౌండరీకి తరలించడాన్ని తన ట్రేడ్‌ మార్క్‌గా మలుచుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్, తన అంతర్జాతీయ కెరీర్‌లో 17 వేలకు పైగా పరుగులు చేశాడు...

Sehwag-Ganguly

తన వీరబాదుడు బ్యాటింగ్‌తో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్, 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత సచిన్ టెండూల్కర్‌నే డామినేట్ చేశాడు. సచిన్ అవుటైతే మ్యాచ్ పోయినట్టే అని పరిస్థితుల నుంచి సెహ్వాగ్ ఉన్నాడుగా.. అనే భరోసాని అభిమానుల్లో నింపాడు వీరూ...


Virender Sehwag

అయితే సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్, రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి 2015, అక్టోబర్ 20న (తన పుట్టిన రోజు కూడా) రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్‌లో టెండూల్కర్‌కి దక్కిన గౌరవం, వీరూకి దక్కలేదు...

కెరీర్ చివర్లో రిటైర్మెంట్ ఇచ్చేందుకు ఒక్క ఫేర్‌వెల్ మ్యాచ్ ఇవ్వాల్సిందిగా సెలక్టర్లను కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వీరూకి. సెహ్వాగ్ లాంటి క్రికెటర్, ఆస్ట్రేలియాలోనో, ఇంగ్లాండ్‌లోనే పుట్టి ఉంటే... ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. జట్టుకి ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన ప్లేయర్‌ని ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది...

Virender Sehwag

సచిన్ టెండూల్కర్ క్లాస్ బ్యాట్స్‌మెన్, ఆయన మాటతీరు కూడా అంతే. టెండూల్కర్ సౌమ్యుడు కావడం వల్లే 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించగలిగాడు. వీరూ అతని బ్యాటింగ్‌లాగే కాస్త మాస్. ఎదుటివాళ్లు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే రకం. ఇదే అతని కెరీర్‌కి సరైన ముగింపు ఇవ్వలేకపోయింది...

Virender Sehwag

సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేల ప్రోత్సాహకంతో టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన వీరూ, తనకంటే జూనియర్ అయిన ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఇమడలేకపోయాడు. అదీకాకుండా వికెట్ల మధ్య వీరూ చాలా నెమ్మదిగా ఉండేవాడు. ఒక్క బౌండరీ బాదితే 4 పరుగులు వస్తుంటే, దాని కోసం 4 సింగిల్స్ తీసి 4 బంతులు వేస్ట్ చేయడం ఎందుకనేది వీరూ ఫిలాసఫీ...

ఇదే వీరూని సైడ్ చేయడానికి ప్రధాన కారణమైంది. మహీ కెప్టెన్‌గా మారి 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టులో సంచలన మార్పులు తీసుకొచ్చాడు. సెలక్టర్లు కూడా ధోనీ చెప్పిన దాన్ని కాదనలేని పరిస్థితి. వికెట్ల మధ్య బద్ధకంగా పరుగెత్తుతూ, ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండడం లేదనే వంకతో వీరూని సైడ్ చేశారు సెలక్టర్లు...

Virender Sehwag

టెండూల్కర్ 90+ల్లోకి వచ్చిన తర్వాత ఒక్కో పరుగు తీస్తూ సెంచరీ పూర్తి చేసుకోవడానికి ఆపసోపాలు పడుతూ ఉంటే... వీరూ మాత్రం 94 పరుగుల వద్ద సిక్సర్లు కొట్టేవాడు. 99 పరుగులు చేసిన తర్వాత సిక్సర్లు బాది సెంచరీ అందుకునేవాడు. ఇలా డబుల్ సెంచరీలు, త్రిబుల్ సెంచరీలు అందుకున్న వీరూ... కొన్నిసార్లు క్యాచ్ ఇచ్చి అవుటైనా పద్దతి మాత్రం మార్చుకోలేదు..

బౌలింగ్ చేసేది ఎవ్వరు? ఆడుతోంది ఎక్కడ? ఏ జట్టుపైన... అనే వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా తన స్టైల్‌లో బ్యాటుతో విధ్వంసం సృష్టించే వీరూ లాంటి ప్లేయర్ దొరకడం టీమిండియా అదృష్టమైతే, అలాంటి ప్లేయర్‌ని నూరు శాతం వాడుకోలేకపోడం భారత జట్టు చేసుకున్న దురదృష్టం.. 

Latest Videos

click me!