దేశానికి ట్రోఫీలు తేవాలంటే ఐపీఎల్ ఆడటం మానేయ్.. హిట్‌మ్యాన్ పై చిన్ననాటి కోచ్ ఆగ్రహం

First Published Nov 25, 2022, 1:15 PM IST

టీ20 ప్రపంచకప్ లో జట్టును నడిపించడంలో విఫలమైన టీమిండియా సారథి  రోహిత్ శర్మపై అతడి చిన్ననాటి కోచ్  దినేశ్  ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశానికి ట్రోఫీలు తేవాలంటే ఐపీఎల్ ఆడటం మానేయాలని హితువు పలికాడు. 

గత కొంతకాలంగా  తన వ్యక్తిగత ఫామ్ ను కోల్పోయి టీ20 ప్రపంచకప్ లో విఫలమవడమే గాక  కీలక సెమీస్ లో భారత్ ను నడిపించడంలో విఫలమైన టీమిండియా సారథి  రోహిత్ శర్మపై అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమికి  సాకులు చెప్పడం మానాలని,   దేశానికి ట్రోఫీలు తేవాలంటే  ఐపీఎల్ మానేయాలని  దినేశ్ సూచించాడు. 
 

టీ20 ప్రపంచకప్ ముగిశాక  రోహిత్ కు  బీసీసీఐ మరోసారి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఏముందని  దినేశ్ ప్రశ్నించాడు.  తాజాగా రోహిత్ ఆటతీరుపై  స్పందిస్తూ.. ‘వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రోహిత్ కు విశ్రాంతినిస్తున్నారని అంటున్నారు. అసలు ప్రొఫెషనల్ క్రికెటర్లకు వర్క్ లోడ్ సమస్య ఏంటి..? 

అలాంటప్పుడు మీరు ఐపీఎల్ ఆడటం మానేయండి.  మీరు దేశానికి ట్రోఫీలు తీసుకురావాలనుకుంటే ఐపీఎల్ ఆడకండి. ఐపీఎల్ ఆడుతూ వర్క్ లోడ్ ఏంటి మళ్లీ..? మీరు ప్రొఫెషనల్ క్రికెటర్లు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మీ ఆట ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నియమించిన బోర్డు, మీ ఆటను చూసే అభిమానులు మీరు ఎంతో కొంత రాణిస్తారనే కదా మిమ్నల్ని జాతీయ జట్టుకు పంపేది.. 

అంతర్జాతీయ స్థాయిలో ఆడేప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే కుదరదు. అసలు రోహిత్ ఇన్ని సార్లు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ ను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు  కెప్టెన్ నిత్యం టీమ్ తో ఉండాలి. జట్టుకు మార్గనిర్దేశకుడిగా పనిచేయాలి.  ప్రతీ మ్యాచ్ లోనూ ఆడాలి. కెప్టెన్ గా అది నీ బాధ్యత..’ అని  ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

టీ20 ప్రపంచకప్  కు ముందు హిట్ మ్యాన్ ప్రతీ  మూడు సిరీస్ లకు మధ్యలో గ్యాప్ తీసుకునేవాడు. ఈ కారణంగా ఏడాదిలో భారత జట్టు ఏడుగురు సారథులను మార్చింది. దీంతో టీ20 ప్రపంచకప్ లో సమన్వయం కొరవడి భారత్ సెమీస్ లోనే ఇంటిముఖం పట్టిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీ20 వరల్డ్ కప్  వైఫల్యం తర్వాత  రోహిత్ శర్మను   తొలగించి హార్ధిక్ పాండ్యాను  సారథిగా నియమిస్తారని  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నారు. వయసు రీత్యా  రోహిత్  ను టీ20 బాధ్యతల నుంచి తప్పించి   వచ్చే పొట్టి ప్రపంచకప్ వరకూ  హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని కొత్త జట్టును సిద్ధం చేయాలని  క్రికెట్ విశ్లేషకులు వాదిస్తున్నారు. 

click me!