Asia Cup: దానిని ఇండియా-పాకిస్తాన్ టోర్నీలా చూడొద్దు.. మీ లక్ష్యం అదే కావాలి: టీమిండియాకు దాదా కీలక సూచన

First Published Aug 17, 2022, 10:36 AM IST

India vs Pakistan: ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ లో భాగంగా 28న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్నది.  ఈ మ్యాచ్ మీద ఇప్పటికే ఇరు జట్లపై భారీ అంచనాలున్నాయి. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం.. 

ఆసియా కప్-2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది టీ20  ప్రపంచకప్ లో భారత్ ను  చిత్తుగా ఓడించిన పాక్ పై పగ తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. మరోసారి ఇండియాకు ఓటమి రుచి చూపించాలని పాక్ భావిస్తున్నది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 28న జరగనున్న మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. 

అయితే ఈ మ్యాచ్ ను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. భారత్-పాక్ మ్యాచ్ ను ఒక మ్యాచ్ గా చూడాలే తప్ప దానికి మరీ ఇంత హంగామా చేయాల్సిన పన్లేదని అంటున్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా లక్ష్యం ఆసియా కప్ నెగ్గేదై ఉండాలే తప్ప ఈ టోర్నీని ఇండియా-పాకిస్తాన్ టోర్నీలా చూడొద్దని సూచిస్తున్నాడు. 
 

దాదా మాట్లాడుతూ.. ‘నేను  క్రికెట్ ఆడే రోజుల్లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యేకంగా ఏమీ చూడలేదు. నా దృష్టిలో అది మరో మ్యాచ్ అంతే. అంతకుమించి నేను ఆ మ్యాచ్ కు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక త్వరలో ఆసియా కప్ వేదికగా జరుగబోయే ఇండియా-పాక్ మ్యాచ్ కూడా అలాంటిదే. 
 

ప్రస్తుతం టీమిండియా బాగా ఆడుతోంది. గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఆసియా కప్ లో కూడా ఆ ప్రదర్శన కొనసాగిస్తున్నదని నేను నమ్ముతున్నాను. ఇక దీనిని ఆసియా కప్ గా చూడాలే తప్ప ఇండియా-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టోర్నీలా కాదు...’ అని సూచించాడు. 

ఐసీసీ ప్రపంచకప్ లతో పాటు ఆసియా కప్ లో కూడా పాక్ మీద భారత్ కు మంచి రికార్డు ఉంది. ఆసియా కప్ లో  దాయాదులు తలపడుతుండటం ఇది 15వ సారి.  ఇందులో 8 సార్లు భారత్ గెలవగా 5 సార్లు పాకిస్తాన్ గెలిచింది. 
 

ఈ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్తాన్ ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశముంది. గ్రూప్ స్టేజ్ లో ఒకసారి..  సూపర్-4 లో మరోసారి.. ఇరుజట్లు ఫైనల్ చేరితే  అక్కడ కూడా దాయాదుల పోరును  అభిమానులు ఎంజాయ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఆసియా కప్ ముగిశాక నెలన్నరకు ఇరు దేశాలు  ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ వేదికగా టీ20 ప్రపంచకప్ లో తలపడతాయి. 

click me!