కివీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్‌కు గాయం.. ప్రపంచకప్‌కు అనుమానమే..

First Published Oct 7, 2022, 2:55 PM IST

T20I World Cup 2022: ప్రపంచకప్ సమీపిస్తున్న కొద్దీ   సన్నాహకాల కోసం  మ్యాచ్ లు ఆడుతున్న వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా కివీస్ ఆల్ రౌండర్ కూడా చేరాడు. 
 

పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.  గతేడాది  టీ20 ప్రపంచకప్ లో ఆ జట్టు ఫైనల్  చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ఈసారి మెగా టోర్నీలో ఆడేది అనుమానంగానే ఉంది.  

ప్రస్తుతం న్యూజిలాండ్.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈ సిరీస్ లో భాగంగా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్న మిచెల్ కుడి చేతి  వేలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడు  ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. 

ప్రాక్టీస్ సెషన్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి కుడి చేతి బొటనవేలుకు బలంగా తాకడంతో మిచెల్ కు గాయమైందని ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది. అతడు కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలైనా పట్టేలా ఉందని  సమాచారం. అదే జరిగితే రాబోయే టీ20 ప్రపంచకప్ లో మిచెల్ ఆడతాడా..? లేదా..? అనేది అనుమానమే..

ఇదే విషయమై కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. ‘అవును. మిచెల్ కు గాయమైంది. అతడు ఈ  ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కీలకమైన ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో అతడు గాయపడటం మా దురదృష్టం. 

మిచెల్ మా జట్టులో కీలక సభ్యుడు. అయితే అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడా..? లేదా..? అనేది ఇప్పుడే ఏం చెప్పలేం.  గాయం తీవ్రతను పరిశీలించి ఈనెల 15 వరకు  తుది నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు. 

ఇక టీ20 ప్రపంచకప్ లో గ్రూప్-1లో ఉన్న న్యూజిలాండ్.. తమ తొలి మ్యాచ్ ను  సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈనెల 22న తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ నాటికల్లా మిచెల్ కోలుకుంటాడా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. 

ప్రపంచకప్ సన్నాహకాల్లో  భాగంగా వివిధ జట్లు  మ్యాచ్ లు ఆడుతున్నాయి.  అయితే ఈ క్రమంలో గాయాలకు బలౌతున్నాయి. భారత జట్టు నుంచి బుమ్రా, దక్షిణాఫ్రికా నుంచి డ్వేన్ ప్రిటోరియస్, ఇంగ్లాండ్ నుంచి జానీ బెయిర్ స్టో లు గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మిచెల్ కూడా చేరనున్నాడు. 
 

click me!