గిల్ టీ20లకు వేస్ట్.. అతడి ప్లేస్‌లో ఢిల్లీ ఓపెనర్‌ను ఆడించడమే బెటర్.. పాక్ మాజీ స్పిన్నర్ కామెంట్స్

First Published Jan 30, 2023, 2:27 PM IST

భారత జట్టు ఓపెనర్ శుభ‌మన్ గిల్ టీ20లో వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని  ఈ ఫార్మాట్ నుంచి తప్పించి  ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న పృథ్వీ షా ను ఆడించాలని  ఇదివరకే  టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు. 

టీమిండియా  యువ ఓపెనర్  శుభ్‌మన్ గిల్ వన్డేలలో  అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. టెస్టులలో అడపాదడపా ఛాన్స్ లు వస్తున్నా  ఫర్వాలేదనిపిస్తున్నాడు.  ఎటొచ్చి  అతడిని టీ20లలోకి తీసుకోవడమే   విమర్శలకు తావిస్తున్నది. పొట్టి ఫార్మాట్ లో గిల్  పదే పదే విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. 

ఈ ఏడాది శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్ లో గిల్.. మూడు మ్యాచ్ లలో వరుసగా 7, 5, 46 పరుగులు చేశాడు.  కానీ ఆ తర్వాత  ఆడిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయాడు. కివీస్ తో కూడా వన్డే సిరీస్ లో ఓ డబుల్ సెంచరీ, సెంచరీ చేశాడు. మళ్లీ టీ20 సిరీస్ లో మాత్రం విఫలమవుతున్నాడు. రెండు మ్యాచ్ లలో గిల్.. 7, 11 పరుగులు మాత్రమే చేశాడు. 

టీ20 సిరీస్ కు ముందు ఈసారి జట్టులో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్  పృథ్వీ షాకు  కూడా చోటు దక్కింది. గిల్ తొలి మ్యాచ్ లో విఫలం కావడంతో అతడు టీ20లకు పనికిరాడని తేల్చిన విశ్లేషకులు.. షా కు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు.  గిల్ కంటే టీ20లలో  పృథ్వీ షా కు మంచి రికార్డు ఉంది. స్ట్రైక్ రేట్ కూడా గిల్ కంటే షా కే ఎక్కువ. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. 

గిల్ టీ20లో వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని  ఈ ఫార్మాట్ నుంచి తప్పించి  పృథ్వీ షా ను  ఓపెనర్ గా పంపాలని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు.  లక్నో టీ20 తర్వాత  కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ... ‘ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లో జరిగేది  కీలక మ్యాచ్. గత రెండు టీ20లలో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు.  అతడితో పోల్చితే పృథ్వీ షా  కు టీ20లలో మంచి రికార్డు ఉంది. 
 

షా అటాకింగ్ గేమ్ తో అదరగొడతాడు.  గిల్ ప్లేస్ లో  అతడిని ఆడించాలి.   షా కు నైపుణ్యం ఉంది. అతడికి నిలకడగా ఛాన్సులు ఇవ్వగలిగితే షా అద్భుతాలు చేస్తాడు.  గిల్  కూడా అద్భుతమైన బ్యాటరే. అందులో సందేహం లేదు.  కానీ అతడు టీ20లలో విఫలమవుతున్నాడు.  గిల్ బ్యాటింగ్ లో చాలా లోపాలున్నాయి.   స్పిన్, బౌన్స్ బంతులు ఆడటంలో విఫలమవుతున్నాడు. 

లక్నో మ్యాచ్  లో భారత్ గెలిచింది. కానీ  ఈ మ్యాచ్ లో ఆటగాళ్ల లోపాలు దాచిపెట్టలేనివి.  కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని ధీటుగా ఎదుర్కోవాలి..’ అని అన్నాడు. లక్నో మ్యాచ్ లో  భారత్ గెలిచి  సిరీస్ సమం అయిన నేపథ్యంలో   అహ్మదాబాద్ లో  ఫిబ్రవరి 1 న జరుగబోయే మూడో టీ20 ఇరు జట్లకూ కీలకం కానుంది.  

click me!