ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఉంది కదా.. అందుకే ఇలా..! తన బ్యాటింగ్‌పై సూర్యా భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 30, 2023, 1:29 PM IST

INDvsNZ: బంతి దొరికితే  బౌండరీ లైన్ దాటించడమే పనిగా పెట్టుకునే  సూర్యకుమార్ యాదవ్ కూడా నిన్నటి మ్యాచ్ లో  నెమ్మదిగా ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం అతడు  తాను ఎందుకు ఇలా ఆడానో కారణం చెప్పాడు. 

భారత్ - న్యూజిలాండ్ నడుమ లక్నో వేదికగా  ఆదివారం ముగిసిన  రెండో టీ20లో  కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ అష్టకష్టలు పడింది.  క్రీజులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లు ఉన్నా  విజయం కోసం చివరి బంతి వరకూ ఆగాల్సి వచ్చింది. 

స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై  బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బందిపడ్డారు.  మ్యాచ్ లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా నమోదుకాలేదంటే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  బంతి దొరికితే  బౌండరీ లైన్ దాటించడమే పనిగా పెట్టుకునే  సూర్యకుమార్ యాదవ్ కూడా  నిన్నటి మ్యాచ్ లో  నెమ్మదిగా ఆడాడు. అతడు 31 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 
 

అయితే  మ్యాచ్ అనంతరం  సూర్య మాట్లాడుతూ.. ఈరోజు తనలోని భిన్నమైన సూర్యను చూశారని అన్నాడు.  రెండో ఇన్నింగ్స్ లో పిచ్ ఇంత కఠినంగా మారుతుందని తాము ఊహించలేదన్న సూర్య.. వాషింగ్టన్ రనౌట్ లో తనదే  తప్పు అని  ఒప్పుకున్నాడు. 

సూర్య మాట్లాడుతూ.. ‘ఈరోజు  స్కై (సూర్యను అభిమానులు  ఇష్టంగా పిలుచుకునే పేరు)  లోని డిఫరెంట్ వెర్షన్ ను మీరు చూశారు.  నేను బ్యాటింగ్ కు వెళ్లాక  పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఎంతో ముఖ్యం. వాషింగ్టన్  ఔటయ్యాక ఎవరో ఒకరు ఆటను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమనిపించింది. అందుకే   నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. వాస్తవానికి వాషింగ్టన్ రనౌట్ లో అతడి తప్పేమీ లేదు. 

అక్కడ  పరుగు రాకున్నా నేనే తొందరపడ్డాను.  ఇక మ్యాచ్ చివరి ఓవర్ లో హార్ధిక్ నా వద్దకు వచ్చి నువ్వు ఈ బంతికి మ్యాచ్ ను ఫినిష్ చేయబోతున్నావు అని చెప్పాడు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.   అందుకే ఐదో బంతికి ఫోర్ కొట్టా..’అని చెప్పాడు.  

ఇదిలాఉండగా కివీస్ తో సిరీస్ తర్వాత  భారత జట్టు ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు  సూర్య కూడా ఎంపికయ్యాడు.  ఈ సిరీస్ లో సూర్య ఆడేది  పక్కానే. దీంతో  ఎలాగూ టెస్టులకు ప్రాక్టీస్ అవుతుందని   లక్నో మ్యాచ్ లో ఇలా ఆడావా సూర్యా..? అని టీమిండియా ఫ్యాన్స్ వాపోతున్నారు. 

కాగా నిన్నటి మ్యాచ్ లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు.  అటు కివీస్ తో పాటు ఇటు టీమిండియా ప్లేయర్కలు కూడా  సిక్సర్ కొట్టడానికి తంటాలు పడ్డారు.  సిక్సర్ల సంగతి దేవుడెరుగు కనీసం  రాకెట్ స్పీడ్ తో బంతులు బౌండరీ లైన్  దాటడానికి  అష్టకష్టాలు పడ్డాయి.  భారత్  లో ఇలా ఒక టీ20 మ్యాచ్ లో  ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం  చరిత్రలో ఇదే ప్రథమం.  

click me!