CSK vs KKR IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ఆట కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ లో మరోసారి చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ 2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో ఏ సమయంలోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీ20 క్రికెట్ ను ఆడుతున్నట్టుగా కనిపించలేదు. మరోసారి చెత్త బ్యాటింగ్ తో 20 ఓవర్లు ముగిసే సరికి 103/9 పరుగులు మాత్రమే చేసింది. ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కేవలం 10.1 ఓవర్ లోనే 107/2 పరుగులతో విజయం సాధించింది.
CSK vs KKR
ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ధోని కెప్టెన్ గా తిరిగొచ్చాడు. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా ఉన్న ధోని చెన్నై టీమ్ ను మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి తీసుకువస్తాడని భావించారు కానీ, అలాంటిదేమీ జరగలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు టీ20 ఆడుతున్నామనే విషయాన్ని మర్చిపోయినట్టుగా తమ జిడ్డు బ్యాటింగ్ ను కొనసాగించారు. పవర్ ప్లే లో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. విజయ్ శంకర్ మరోసారి జిడ్డు బ్యాటింగ్ చేస్తూ 29 పరుగులు చేశాడు. శివం దూబే 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో సీఎస్కే 20 ఓవర్లలో 103-9 పరుగులు చేసింది.
కేకేఆర్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. సునీల్ నరైన్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకుని చెన్నై సూపర్ కింగ్స్ ను దెబ్బకొట్టారు.
MS Dhoni
ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు సునీల్ నరైన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ముందు బౌలింగ్ లో అదరగొట్టిన నరైన్.. బ్యాటింగ్ లో కూడా దుమ్మురేపాడు. సునీల్ నరైన్ కేవలం 18 బంతుల్లో 44 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతను ఈ ఇన్నింగ్స్‌ను 244 పరుగుల స్ట్రైక్ రేట్‌తో ఆడాడు.
CSK vs KKR
అలాగే, కేకేఆర్ మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 23 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (20 పరుగులు*), రింకు సింగ్ (15 పరుగులు*)లు క్రీజులో ఉండి కేకేఆర్ కు విజయాన్ని అందించారు. రింకూ సింగ్ సిక్సర్ తో మ్యాచ్ విన్నింగ్ పరుగులు చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ అద్భుత ప్రదర్శన చేసిన సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
ఈ గెలుపుతో కేకేఆర్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 6 పాయంట్లతో 3వ స్థానంలోకి చేరింది. చెన్నై సూపర్ కింగ్ 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. హైదరాబాద్ టీమ్ చివరి స్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.