వచ్చే ఏడాది జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 సీజన్ కోసం డిసెంబర్ లో వేలం జరుగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ - 16న బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియ జరుగనుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా నవంబర్ 15 వరకు పది ఫ్రాంచైజీలు తమతో ఉండే ఆటగాళ్లు ఎవరు..? వదిలేసిది ఎవరు..? అనే విషయాలపై తమకు తుది నివేదిక సమర్పించాలని బీసీసీఐ ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి.
ఈ మేరకు వేలంలో అత్యంత ఆకర్షిస్తున్న ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. యాక్షన్ లో పాల్గొంటాడని వినిపిస్తన్నాయి. సీఎస్కేతో విభేదాల కారణంగా జడేజా ఆ జట్టును వీడుతాడని చాలా రోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే సీఎస్కే మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తూనే ఉన్నది. జడేజా తమతోనే ఉంటాడని.. అతడితో విభేదాలేమీ లేవని యాజమాన్యం బుకాయిస్తూనే ఉంది. కానీ జడేజా.. సీఎస్కే సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేయడం.. ధోని బర్త్ డే కు సీఎస్కే ఆటగాళ్లంతా కలిసి ఓ వీడియోలో అతడికి విషెస్ చెప్పినా జడేజా అందులో లేకపోవడంతో చెన్నై-జడ్డూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.
జడేజాను సీఎస్కేతో ఉంచే బాధ్యతను ధోని తీసుకున్నాడు. 2012 నుంచి చెన్నైతో కొనసాగుతున్న జడేజా.. ఈ ఫ్రాంచైజీకి కీలక ఆటగాడని.. అతడిని వదులుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరకడం కూడా కష్టమేనన్న అభిప్రాయంతో ఉన్న ధోని.. జడేజాతో మాట్లాడుతున్నట్టు సమాచారం.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన సమాచారం మేరకు.. జడేజా-సీఎస్కేల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను ధోని తీసుకున్నాడని, జడ్డూ చెన్నైతోనే ఉంటాడని సీఎస్కే ప్రతినిధి ఒకరు తెలిపారు. తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా తప్పకుండా ఉంటాడని సదరు ప్రతినిధి ధీమా వ్యక్తం చేశారు.
జడేజాతో పాటు టీమ్ మేనేజ్మెంట్ తో కూడా విభేదాలను పక్కనబెట్టి జడ్డూతో సందికి ప్రయత్నించాలని ధోని సూచించినట్టు తెలుస్తున్నది. మరి ధోని రాయబారం ఫలిస్తుందా..? లేదా..? అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది. కాగా జడేజాను రిటైన్ చేసుకోవాలనుకుంటున్న సీఎస్కే. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నేలను వేలంలో వదిలేయనుందని తెలుస్తున్నది.