ఆడా ఉంటా! ఈడా ఉంటా!! జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీకీ అతడినే హెడ్ కోచ్‌ గా నియమించనున్న సీఎస్కే? అదే జెర్సీ..!

First Published Aug 7, 2022, 6:52 PM IST

South Africa T20 tournament: వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య నిర్వహించనున్న ఈ టోర్నీలో ఇప్పటికే  ఫ్రాంచైజీల ఎంపిక  ప్రక్రియ పూర్తైంది. ఆరు ఫ్రాంచైజీలతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. జోహన్నస్‌బర్గ్ ను సీఎస్కే కొనుగోలు చేసింది.   
 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను సక్సెస్‌ఫుల్ గా నడిపించడంలో కీలక పాత్ర పోషించడంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఎంత ఉందో ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) పాత్ర కూడా అంతే ఉంది. ఐపీఎల్ లో చాలా జట్లు ఈ 15 ఏండ్ల కాలంలో తమ హెడ్ కోచ్ ను మార్చాయి. కానీ ఫ్లెమింగ్ మాత్రం సుదీర్ఘకాలంగా సీఎస్కేకు  ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

ఇదిలాఉండగా తాజాగా సీఎస్కే యాజమాన్యం అతడికి మరో బాధ్యత అప్పజెప్పింది. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో భాగంగా తాము కొనుగోలు చేసిన జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీకి కూడా ఫ్లెమింగ్ నే హెడ్ కోచ్ గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. 

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య నిర్వహించనున్న ఈ టోర్నీలో ఇప్పటికే  ఫ్రాంచైజీల ఎంపిక  ప్రక్రియ పూర్తైంది. ఆరు ఫ్రాంచైజీలతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. జోహన్నస్‌బర్గ్, కేప్‌టౌన్, సెంచూరియన్, పార్ల్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే కొనుగోలు చేశారు. 

ఇందులో భాగంగా జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీఎస్కే.. ఇక్కడి కోచింగ్ టీమ్ నే అక్కడా పంపించనుంది.  దాదాపు ఇక్కడున్న కోచింగ్, సహాయక సిబ్బందే అక్కడా సేవలందించనున్నారని తెలుస్తున్నది. దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్ (గతంలో చెన్నై తరఫున ఐదు సీజన్లు ఆడాడు)  వీరికి జతకలవనున్నాడట.   

జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీ పేరును కూడా సీఎస్కే ఇదే ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటున్నది.  ఆ జట్టు పేరును జోబర్గ్ సూపర్ కింగ్స్ (Joburg Super Kings) అనే పేరును దాదాపు ఖాయం చేసినట్టేనని  సీఎస్కే వర్గాలు తెలిపాయి. 

జోబర్గ్ సూపర్ కింగ్స్ కాకుండా జోజీ  సూపర్ కింగ్స్, జోహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్న సీఎస్కే యాజమాన్యం మాత్రం Joburg Super Kings కే మొగ్గు చూపుతుందని తెలుస్తున్నది. 

కోచింగ్ సిబ్బంది, జట్టు పేరు తో పాటు  ఆటగాళ్ల జెర్సీ కూడా ప్రస్తుతం సీఎస్కే ఆటగాళ్లు వేసుకునే ఎల్లో జెర్సీనే ధరించనున్నారని టాక్ వినిపిస్తున్నది. మరి సీఎస్కే ఇలా చేస్తే మిగిలిన ఐదు ఫ్రాంచైజీలను కొన్న రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాయా..? అనే అనుమానం కలుగుతున్నది. ఇవన్నీ చూస్తుంటే మినీ ఐపీఎల్ కు ఇక్కడి ఫ్రాంచైజీలు సార్థకత చేకూర్చేలా కనిపిస్తుందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

click me!