ప్చ్..! పది పరుగులు చేసుంటే 1441 రోజుల ఎదురుచూపులు తప్పేవిగా పుజారా..!

First Published Dec 14, 2022, 6:32 PM IST

BANvsIND: బంగ్లాదేశ్ పర్యటనలో  ఉన్న టీమిండియా నేటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్  బ్యాటింగ్ లో టాపార్డర్ విఫలమైనా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్ లు  ఆదుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 

టీమిండియాకు మిస్టర్ డిపెండెబుల్ రాహుల్ ద్రావిడ్ తర్వాత  టెస్టు క్రికెట్ లో వాల్ ను మరిపిస్తూ దూసుకొచ్చిన ఆటగాడు ఛతేశ్వర్ పుజారా. గడిచిన దశాబ్దకాలంగా భారత్ గెలిచిన కీలక మ్యాచ్ లలో భాగస్వామిగా ఉన్న  పుజారా గడిచిన రెండు మూడేండ్లుగా  పేలవ ఫామ్ తో విమర్శల పాలవుతున్నాడు.

గతేడాది న్యూజిలాండ్ తో పాటు ఈ ఏడాది సౌతాఫ్రికా టూర్ లో  పుజారా విఫలమవడంతో  సెలక్టర్లు ఫిబ్రవరిలో స్వదేశంలో జరిగిన శ్రీలంకతో టెస్టు సిరీస్ లో పుజారాను  పక్కనబెట్టారు.  కానీ తర్వాత కౌంటీ క్రికెట్ లో పరుగుల వరద పారించిన పుజారా తిరిగి ఇంగ్లాండ్ తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా  జరిగిన టెస్టుతో రీఎంట్రీ ఇచ్చాడు.  అయినా ఆ టెస్టులో కూడా పుజారా  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 

ఇక తాజాగా బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో  పుజారా.. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  భారత టాపార్డర్ కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ లు వెంటవెంటనే ఔట్ కావడంతో  పుజారా  ఆదుకున్నాడు. 48కే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టును  రిషభ్ పంత్ తో కలిసి ఆదుకున్న పుజారా.. పంత్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసి   149 పరుగులు జోడించి తొలి రోజు భారత్ పరువు నిలిపాడు. 

తొలి ఇన్నింగ్స్ లో పుజారా  203 బంతులాడి  11 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో పుజారా ఆట మునపటి  ఆటను గుర్తుకుతెచ్చింది. ఈ క్రమంలో పుజారా మరో 10 పరుగులు చేసుంటే  1441 రోజుల ఎదురుచూపులు తప్పేవి. పుజారా చివరిసారి సెంచరీ చేసింది 2019 జనవరి 3న. అంటే మరో ఇరవై రోజులు గడిస్తే నాలుగేండ్లు. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన పుజారా ఆ తర్వాత  మళ్లీ మూడంకెల స్కోరుకు చేరలేదు. అప్పట్నుంచి బంగ్లాదేశ్ సిరీస్ వరకూ పుజారా 28 టెస్టులు ఆడాడు. అయినా మూడంకెల స్కోరు అందని ద్రాక్షే అయింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో  భాగంగా లీడ్స్ లో జరిగిన టెస్టు కూడా సెంచరీకి దగ్గరగా వచ్చి  విఫలమయ్యాడు. ఆ టెస్టులో పుజారా 91 పరుగులు చేసి నిష్క్రమించాడు. 

2019 నుంచి ఇప్పటివరకూ పుజారా 29 టెస్టులు (బంగ్లాదేశ్ తో టెస్టు కలుపుకుని) ఆడాడు. ఈ వ్యవధిలో 27.87 సగటుతో 1,366 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి కొత్త కుర్రాళ్ల రాకతో  పుజారాకు  రాబోయే రోజుల్లో గట్టి పోటీ తప్పేలా లేదు.  

ఇప్పటికే టెస్టు వెటరన్స్ అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి ఆటగాళ్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ వేస్తున్న బీసీసీఐ..  పుజారా రాణించకుంటే అతడి కెరీర్ కు కూడా  శుభం కార్డు వేస్తారు. అలా కాకుండా ఉండాలంటే పుజారా వీలైనంత ఎక్కువ పరుగులు చేయడం తప్ప మరో అవకాశం లేదు.  అదీగాక  పుజారా వయసు కూడా అతడికి సమస్యగా మారింది.  వచ్చే జనవరిలో పుజారా  35వ పడిలోకి వస్తాడు.  

click me!