మార్పులు తథ్యం..! లేకుంటే తప్పదు భారీ మూల్యం..!! జట్టు ఎంపికపై బీసీసీఐకి సీనియర్ల సలహాలు

First Published Jan 24, 2022, 3:58 PM IST

Former Cricketers Advice To BCCI: ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. ఇకనైనా మేలుకోకపోతే భారత క్రికెట్ కు భారీ  మూల్యం తప్పదని టీమిండియా మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
 

దక్షిణాఫ్రికా పర్యటన భారత జట్టులోని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపింది. జట్టు ఎంపిక, ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, తదితర అంశాలపై ఇన్నాళ్లు చూసీ చూడనట్టు వదిలేసిన సెలెక్టర్లకు.. ఇకపై అలా చేస్తే కుదరదని భారత మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. ఈ ఏడాది  టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 

ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. ఇకనైనా మేలుకోకపోతే భారీ  మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో తమకు ఎదురే లేదని అత్యుత్సహంతో వెళ్లిన టీమిండియా అక్కడ టెస్టులతో పాటు వన్డేలలో కూడా బొక్కబోర్లా పడింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు.. 1-2 తేడాతో ఓడింది. ఇక భావి సారథిగా భావిస్తున్న తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్  నాయకత్వంలోని  టీమిండియా.. వన్డేలలో 0-3తో అవమానకర ఓటమిని పొందింది. 

దీంతో  భారత మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. జట్టులో మార్పులు చేయాల్సిన తరుణం వచ్చిందని బీసీసీఐకి సూచించారు. త్వరలో (ఫిబ్రవరిలో) జరుగబోయే  వెస్టిండీస్ సిరీస్ నుంచే  ఈ మార్పులను చేస్తే బెటరని సలహా ఇచ్చారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటు మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రాలు  ఈ మేరకు స్పందించారు. 
 

గవాస్కర్ స్పందిస్తూ.. ‘ప్రత్యర్థి జట్టు  భాగస్వామ్యాలతో క్రీజులో పాతుకుపోతుంటే భారత  సారథి కెఎల్ రాహుల్ దగ్గర వికెట్ తీసుకునే ఆప్షన్లు లేవు.   మొదటి రెండు వన్డేలలో ఆడిన భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేదు.  ప్రభావం చూపకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరి వన్డేలో దీపక్ చాహర్ ఎంపిక సరైనదే. భారత జట్టు ప్రదర్శనపై పునరాలోచిస్తే అది జట్టుకు మంచిది..’ అని అన్నాడు. 
 

మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘టీ20  క్రికెట్ కు అలవాటు పడ్డ క్రికెటర్లు.. నాలుగైదు ఓవర్లకు మించి  బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనకు 50 ఓవర్లు ఆడే క్రికెటర్లు కావాలి. అంతేగాక మీరు (బీసీసీఐ)  ఆరో బౌలర్, నిఖార్సైన ఆల్ రౌండర్ ను వెతక్కుంటే దానికి  భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది..’ అని  తెలిపాడు. 

ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘ఓటమి మిమ్మల్ని కఠినమైన  నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమిస్తుంది. బారత పరిమిత ఓవర్ల జట్టు లో మార్పులు జరగాల్సిన అవసరముంది. ఇది కొత్త విధానానికి నాంది అవుతుంది...’ అని  చెప్పాడు.

ఇదే విషయమై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే ట్వీట్ చేస్తూ... ‘సౌతాఫ్రికాకు ఘన విజయం. చాలా భాగా ఆడారు. ఓటమిపై ఇండియాకు విశ్లేషించుకునే అవసరం ఎంతైనా ఉంది..’అని పేర్కొన్నాడు. 
 

click me!