
India Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఐసీసీ టోర్నమెంట్ లో యావత్ క్రీడాలోకం ఎదరుచూస్తున్న క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే పోరుకు రంగం సిద్ధమైంది. అదే భారత్-పాకిస్తాన్ మ్యాచ్. దాయాదుల పోరు అంటే రచ్చ మాములుగా ఉండదు. ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడినప్పుడు వచ్చే మజానే వేరు.
బంగ్లాదేశ్‌పై మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఉత్సాహంగా పాక్ తో మ్యాచ్ కు సిద్ధంగా ఉంది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్తాన్ ఎలాగైనా భారత్ పై గెలిచిన టోర్నీలో నిలవాలని చూస్తోంది. ఏ సమయంలోనైనా మ్యాచ్ ను మలుపుతిప్పగలిగే ప్లేయర్లు రెండు జట్లలో ఉన్నారు. అయితే, ఇండియా, పాకిస్తాన్ రెండు జట్లకు బలాలతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జట్టు బలాలు ఏమిటి?
బలమైన బ్యాటింగ్ లైనప్
భారత జట్టు బలం దాని బలమైన బ్యాటింగ్ లైనప్. భారత్ బ్యాటింగ్ లైనప్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో బలంగా ఉంది. ఒకరు విఫలమైనా, మరొకరు తోడుగా ఉండి జట్టును ముందుకు నడిపించగలరు.
మ్యాచ్ విన్నింగ్ ఆల్-రౌండర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు ఎక్కువ ఆల్ రౌండర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా రూపంలో బాల్, బ్యాట్ తో అద్భుతాలు చేయగల ప్లేయర్లు భారత్ సొంతం.
స్టార్ సీనియర్ ప్లేయర్లు
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జడేజా, మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన సీనియర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వారి అనుభవంతో ఒత్తిడిలో కూడా మ్యాచ్ గమనాన్ని మార్చగలరు.
భారత స్పిన్నర్లతో ప్రత్యర్థులకు గుండెదడల్
భారత జట్టు అతి ముఖ్యమైన బలాల్లో ఒకటి అద్భుతమైన స్పిన్ విభాగం. జట్టులో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ వంటి అన్ వేరియంట్ల స్పిన్ మాయాజాలంలో అదరగొట్టే స్పిన్నర్లు భారత జట్టులో ఉన్నారు. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి సహకారం చాలా ముఖ్యం.
భారత జట్టు బలహీనతలు ఏమిటి?
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లతో పోరాటం
భారత జట్టులోని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. గతంలో మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, షాహీన్ అఫ్రిది వంటి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడినా.. తర్వాత మంచి ఇన్నింగ్స్ లను ఆడారు. పాకిస్తాన్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఉండటం భారత్‌కు తలనొప్పిగా మారనుంది. అతని బౌలింగ్ ను దంచి కొడితే భారత్ కు తిరుగుండదు.
పేలవమైన ఫీల్డింగ్
భారత జట్టు ఫీల్డింగ్ ఇటీవల లోపించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సులభంగా పట్టే క్యాచ్‌లు వదిలిపెట్టారు. బౌండరీ లైన్ వద్ద కూడా భారత జట్టు ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడాలి. ఫీల్డింగ్ విభాగంలో భారతదేశం మెరుగుపడటం చాలా అవసరం.
పాకిస్తాన్ జట్టు బలాలు ఏమిటి?
అద్భుతంగా రాణించే ఫాస్ట్ బౌలర్లు
ఏనుగు బలం దాని తొండంలో ఉన్నట్లే, పాకిస్తాన్ గొప్ప బలం దాని ఫాస్ట్ బౌలర్లలో ఉంది. ఆ జట్టులో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ వంటి పేస్ బౌలర్లు ఉన్నారు. వారందరూ కలిసి పనిచేస్తే, భారత్ దెబ్బతినే విధానం ఊహించలేము. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ ఆశించినంతగా రాణించలేకపోయింది. కాబట్టి భారత్ పై ఏం చేస్తారో చూడాలి.
మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్
పాకిస్తాన్ జట్టు గొప్ప బలం దాని కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజం. ఇద్దరూ బాగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ గెలిచింది. 2022 ప్రపంచ కప్‌లో వారిద్దరూ భారత్ పై అద్భుతంగా ఆడి పాక్ కు విజయాన్ని అందించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
పాకిస్తాన్ జట్టు బలహీనతలు ఏమిటి?
భయంకరమైన ఫీల్డింగ్
పాకిస్తాన్ అతిపెద్ద బలహీనత వారి దారుణమైన ఫీల్డింగ్. మైదానంలో బద్ధకంగా ఉండే కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లకు, తమకు వచ్చిన క్యాచ్‌లను వదులుకునే అలవాటు ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌లలో ఫీల్డింగ్‌లో పేలవంగా ప్రదర్శన ఇస్తే, ట్రోఫీ గెలుస్తామని కలలో కూడా ఊహించలేం.
ఐక్యత లోపించడం
పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే, ఆ టీమ్ ఎల్లప్పుడూ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లపై ఆధారపడింది. ఇటీవలి కాలంలో కొంతమంది యువ ఆటగాళ్ళు బాగా ఆడుతున్నప్పటికీ, వారు స్థిరంగా ఫామ్‌లో లేరు.పెద్ద సిరీస్‌లలో ఆటగాళ్లు వ్యక్తిగత ఇన్నింగ్స్ లను కాకుండా కలిసి పనిచేస్తేనే విజయం సాధించవచ్చు అనే విషయం గుర్తించాలి.
ఒత్తిడిని తట్టుకోలేకపోవడం
చాలా మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేక అకస్మాత్తుగా కుప్పకూలిపోతుంది. చాలా మ్యాచ్ లలో పాకిస్తాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేక ఊహించని విధంగా దెబ్బలు తగిలించుకుంది. ఉదాహరణకు 50/5 అనే కష్టమైన పరిస్థితిలో ఉన్నా, 5 ఓవర్లలో 50 పరుగులు కావాలనే కష్టమైన పరిస్థితిలో ఉన్నా పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటి సమయంలో జట్టును ఆదుకునే మ్యాచ్ విన్నర్లు లేకపోవడం పాకిస్తాన్ కు పెద్ద బలహీనత.