చాహల్ ఉంటే వరల్డ్ కప్‌లో ఫలితం మరో విధంగా ఉండేది.. కానీ.. : కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 1, 2023, 4:20 PM IST

టీ20 ప్రపంచకప్ లో చాహల్ ను తుది జట్టులో ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అశ్విన్ కంటే చాహల్ ను ఆడించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.

గతేడాది  ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లోనే ఇంటిబాట పట్టింది.  సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో  దారుణంగా ఓడింది. అయితే ఈ మెగా టోర్నీకి ఎంపికైనా  టీమిండియా  స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్ లు ఆడినా ఒక్కదాంట్లో కూడా చాహల్ కు చోటు లభించలేదు. 

చాహల్ ను తుది జట్టులో ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అశ్విన్ కంటే చాహల్ ను ఆడించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.  2021 టీ20 ప్రపంచకప్ లో జట్టులో చోటు కోల్పోయిన చాహల్.. 2022లో చోటు దక్కినా బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. 

తాజాగా టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్ చాహల్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అశ్విన్ కు బదులు చాహల్ తుది జట్టులో ఉండి ఉంటే ప్రపంచకప్ లో   భారత్ కు ఫలితాలు మరో విధంగా వచ్చి ఉండేవని అన్నాడు. క్రిక్ బజ్ తో  మాట్లాడుతూ కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Image credit: Getty

‘టీ20 ప్రపంచకప్ లో తుది జట్టు కూర్పుపై తుది నిర్ణయం  కెప్టెన్,  హెడ్ కోచ్ లదే. ప్రతీ ఆటగాడి మీద నమ్మకముంచిన ఆ ఇద్దరూ  తుది జట్టును ఎంపిక చేశారు. వాస్తవంగా చెప్పాలంటే టోర్నీ ప్రారంభంలో అశ్విన్ బాగానే  బౌలింగ్ చేశాడు. కానీ  చివర్లో తడబడ్డాడు.  

నా అభిప్రాయం ప్రకారం  ఒకవేళ చాహల్ ఉండి ఉంటే టీమిండియా ఫలితాలు మరో విధంగా ఉండేవేమో.. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత  ఇలా మాట్లాడటం  కూడా సరికాదు. మొత్తమ్మీద  ఆసియా కప్,  టీ20 ప్రపంచకప్ లలో మేం  అనుకున్న స్థాయిలో ప్రదర్శనలు చేయలేకపోయాం.  టీమిండియా నుంచి అభిమానులు మరింత మెరుగైన ఆటను  కోరుకుంటున్నారు...’అని అన్నాడు. 

2022లో మిశ్రమ ఫలితాల తర్వాత  భారత జట్టు  మరో రెండ్రోజుల్లో  శ్రీలంకతో  స్వదేశంలో పరిమిత ఓవర్ల  సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 3 నుంచి  టీ20 సిరీస్ మొదలుకావాల్సి ఉంది.   ఈ సిరీస్ నుంచే భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్ కు మెరుగైన ఆటగాళ్లను తయారుచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. 

click me!