IPL Auction: రాజస్థాన్ రాయల్స్ కు షాకిచ్చిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్.. ఐపీఎల్ వేలం నుంచి ఔట్..!

First Published Jan 18, 2022, 12:47 PM IST

Ben Stokes Out Of IPL Auction: ఐపీఎల్  వేలం నుంచి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే వేలం నుంచి తప్పుకోవాలని ఆ జట్టు టెస్టు సారథి రూట్ నిర్ణయించుకోగా.. తాజాగా బెన్ స్టోక్స్ కూడా అదే బాటలో పయనించాడు. 
 

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ షాక్ తగిలింది. గత మూడేండ్లుగా ఆ జట్టుతో ఉన్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. రాజస్థాన్ కు గట్టి షాకిచ్చాడు.
 

త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలంలో అతడిని దక్కించుకోవాలని ఆశించిన రాజస్థాన్ ఆశల్ని అతడు అడియాసలు చేశాడు. ఈసారి ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండాలని అతడు భావిస్తున్నట్టు ఇంగ్లాండ్ కు చెందిన పలు పత్రికా కథనాల సారాంశం.

ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల పేర్లను పంపించాలని బీసీసీఐ.. ఇప్పటికే పలు క్రికెట్ బోర్డులు, క్రికెటర్లకు  ఆహ్వానాలు పంపింది.  జనవరి 20 లోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.  ఈ నేపథ్యంలో అతడి పేరును  నమోదు చేసుకోలేదు.

చేతికి గాయం.. మానసిక సమస్యలతో సతమతమవుతూ.. ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని తిరిగి ఇటీవలే ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్  సందర్భంగా ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు  స్టోక్స్.. ఈ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడిన స్టోక్స్.. దారుణంగా విఫలమయ్యాడు. 

బ్యాటింగ్ లో 236 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్ లో నాలుగు వికెట్లే పడగొట్టాడు. దీంతో ఆల్ రౌండర్ గా ఉండి అత్యంత పేలవంగా ఆడిన స్టోక్స్ ఆటతీరుపై తీవ్రంగా విమర్శలువచ్చాయి. 
 

అయితే ఐపీఎల్ కారణంగానే స్టోక్స్ తో పాటు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఇతర ఆటగాళ్లు టెస్టు సిరీస్ లో దారుణంగా విఫలమయ్యారని, వాళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడకుండా నియంత్రించాలని ఇంగ్లీష్ మాజీలు  ఆ దేశ బోర్డుకు సూచించారు. 
 

యాషెస్ తో పాటు గతేడాది  ఇంగ్లాండ్ టెస్టులలో దారుణంగా వైఫల్యం చెందింది. భారత్ తో టెస్టు సిరీస్ లో కూడా 2-1 తేడాతో వెనుకబడి ఉంది.

వచ్చే సీజన్ ఇంగ్లాండ్ కు కీలకం కానుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ కు కీలక పర్యటనలున్నాయి.  వాటి కోసం  మానసికంగా సిద్ధంగా ఉండటంతో పాటు ఫ్రెష్ గా ఉండేందుకే  తాను  ఐపీఎల్ వేలం నుంచి తప్పుకుంటున్నట్టు బెన్ స్టోక్స్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా.. కొద్దిరోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్ ను  రిటైన్ చేసుకోలేదు. ఆ జాబితాలో కెప్టెన్ సంజూ శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు) లను తిరిగి తీసుకుంది.  
 

బెన్ స్టోక్స్ ను రిటైన్ చేసుకోకపోయినా అతడిని వేలంలో  దక్కించుకోవాలని రాజస్థాన్ ఆశించింది.  కానీ  అతడి తాజా నిర్ణయంతో రాజస్థాన్ కు  షాక్ తగిలినట్టే అయిందని అంటున్నారు ఆ జట్టు అభిమానులు. 
 

 స్టోక్స్ కు ముందే ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ కూడా ఈసారి మెగా వేలం నుంచి  తప్పకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ గతంలో వేలంలో పాల్గొంటామని చెప్పి తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. 

click me!