రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాకు కొత్త కెప్టెన్

First Published | Jan 8, 2025, 12:04 AM IST

Rohit Sharma: 2024 లో రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్ లో పెద్ద‌గా రాణించ‌లేదు. ఆసీస్ తో జ‌రిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఘోరంగా విఫ‌లంకావ‌డంతో  చివరి టెస్టును కూడా ఆడ‌లేదు. 
 

సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తును సెలక్టర్లు నిర్ణయించాలని భారత మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇప్పుడు విరాట్, రోహిత్ లు హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఘోరంగా విఫ‌ల‌మైంది. 200 పరుగుల మార్కును అందుకోవ‌డంలో చాలా సార్లు విఫ‌ల‌మైంది. దీనికి ప్రధాన కారణాలలో బ్యాటింగ్‌లో వైఫల్యం కాగా, సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కోహ్లీ, రోహిత్ లు టార్గెట్ గా మారారు.

ఈ క్ర‌మంలోనే భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌ని తెలుస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మకు బదులుగా కొత్త కెప్టెన్‌ ఉంటాడని పుకార్లు మొదలయ్యాయి. అస‌లు భార‌త జ‌ట్టులో ఏం జ‌రుగుతోంది? 

రోహిత్ శర్మ ఔట్ 

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కనబర్చాడు. అతను 6 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశాడు. నాయకత్వంలో కూడా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ సిరీస్ లో చివ‌రిదైన సిడ్నీ టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. రోహిత్ శ‌ర్మ ఇక టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకోవాల‌నే చ‌ర్చ కూడా క్రికెట్ స‌ర్కిల్ లో మొద‌లైంది. 


ఛాంపియన్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా?

రోహిత్ శర్మను వ‌రుస‌గా విఫ‌లం కావ‌డంతో అత‌నికి జ‌ట్టు నుంచి ఉద్వాస‌న ప‌ల‌కాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంద‌నే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఆసీస్ తో జ‌రిగిన చివ‌రి టెస్టు నుంచి బీసీసీఐ త‌ప్పించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత రోహిత్ జ‌ట్టుకు మ్యాచ్ గెల‌వ‌డం ముఖ్యం కావ‌డంతో ఫామ్ లో లేని తానే త‌ప్పుకున్నాన‌ని చెప్పాడు. 

ఇదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వ‌చ్చాయి. వన్డే క్రికెట్ నాయకత్వం నుంచి అతడిని తప్పించాలని బీసీసీఐ యోచిస్తోందని పుకార్లు మొదలయ్యాయి. అత‌ని స్థానంలో హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా కొన‌సాగించాల‌నే నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శ‌ర్మ దూరం కానున్నాడా? 

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు.

ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లకు ఓవర్లు రొటేట్ చేస్తూ.. రోహిత్ తడబడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే కప్ గెలవదని బీసీసీఐ భావిస్తోంది.

టెస్టు, వన్డే క్రికెట్‌లు వేర్వేరు ఫార్మాట్‌లు అయినప్పటికీ నాయకత్వ శైలి ఒకటేనని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కెప్టెన్సీలో బలహీనంగా ఉన్న రోహిత్ శర్మను తప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా ఎందుకు?

హార్దిక్ పాండ్యా కష్ట సమయాల్లో ఐపీఎల్‌లో భారత టీ20 జట్టును, గుజరాత్ జట్టును బాగా నడిపించాడు. నాయకత్వ అనుభవం బాగుంది. అందువల్ల 50 ఓవర్ల మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్ అని బీసీసీఐ భావించిందని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కొన్ని మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన శుభమాన్ గిల్‌కు నాయకత్వ అనుభవం తక్కువ. ప్రస్తుతం టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో పెద్ద‌గా పరుగులు చేయడం లేదు. దీంతో హార్దిక్ పాండ్యా బీసీసీఐ దృష్టిలో పడ్డాడు.

ఇదే నిజమైతే, ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ కెప్టెన్ గా మారుతాడు. సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్ కావచ్చు. చూడాలి మ‌రి రోహిత్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో !

Latest Videos

click me!