Sam Curran: గాయంతో టీ20 ప్రపంచకప్ కు దూరమైన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్.. ఐపీఎల్ కూ డౌటే..!

First Published Oct 5, 2021, 6:50 PM IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్ కు ముందు Engalnd Teamకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్, ప్రస్తుతం ఐపీఎల్ లో Chennai Super kings తరఫున ఆడుతున్న సామ్ కర్రన్ గాయం కారణంగా బిగ్ టోర్నీ నుంచి తప్పకున్నాడు. 

టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతూ ఈసారి  పొట్టి ప్రపంచకప్ చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 

2010లో టీ20 ఛాంపియన్లుగా అవతరించిన ఇంగ్లండ్.. ఈసారి  అదే విజయాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నది. అయితే ఆ జట్టు  యువ ఆటగాడు, ఆల్ రౌండర్ సామ్ కర్రన్ గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్ కు దూరమయ్యాడు. 

కర్రన్ కు వెన్నులో గాయమవడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఈసీబీ ప్రకటించిన సభ్యుల జాబితాలో సామ్ కర్రన్ కు బదులుగా అతడి సోదరుడు టామ్ కర్రన్ ను తుది జట్టులోకి ఎంపికయ్యాడు. 

కొద్దిరోజుల్లోనే సామ్.. దుబాయ్ నుంచి యూకేకు చేరుకుంటాడని, ఇక్కడ అతడికి స్కానింగ్ తీసిన తర్వాత కర్రన్ గాయంపై వైద్యుల బృందం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈసీబీ తెలిపింది. 

టామ్ తో పాటు లెఫ్టార్మ్ సీమర్ రీస్ టోప్లే కు కూడా జట్టులో స్థానం కల్పించారు సెలెక్టర్లు. అయితే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ల పేర్లు కూడా తాజా జట్టులో లేవు. 
 

ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై తరఫున తొమ్మిది మ్యాచ్ లు ఆడిన 23 ఏళ్ల కర్రన్.. తొమ్మిది వికెట్లు తీశాడు. బ్యాట్ తో 56 పరుగులు చేశాడు. నాలుగు రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా కర్రన్ గాయపడ్డట్టు తెలుస్తున్నది. అయితే టీ20 ప్రపంచకప్ కంటే ముందే అతడు ఐపీఎల్ నుంచి నిష్క్రమించనున్నట్టు సమాచారం.

ఇదిలాఉండగా ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 23న తమ ప్రపంచకప్ వేట మొదలుపెట్టబోతున్నది. గ్రూప్ 1 లో ఉన్న ఆ జట్టు.. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ ను ఢీకొట్టబోతున్నది. ఇదే గ్రూపులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా కూడా ఉన్నాయి. 

Sam Curran

ఇంగ్లండ్ జట్టు : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.  రిజర్వు ప్లేయర్లు : లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్ 

click me!