మీరా సుద్దులు చెప్పేది..? బ్రిస్బేన్ గురించి మాట్లాడరేం? పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతున్న కంగారూలకు కౌంటర్

First Published Feb 5, 2023, 11:49 AM IST

Border Gavaskar Trophy: భారత్  లో స్పిన్ పిచ్ లు కాకుండా  ఫ్లాట్, సరైన పిచ్ లను తయారుచేస్తే మాదే గెలుపు అంటూ  తలా తోక లేని వ్యాఖ్యలు చేస్తున్న ఆస్ట్రేలియా  తాజా మాజీ క్రికెటర్లకు  గవాస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా  ఆట కంటే ముందే నోటికి పనిచెప్పింది.  ఇండియాలో పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయని.. అలా కాకుండా  ఫ్లాట్ వికెట్లు, బ్యాటింగ్, బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లను తయారుచేయాలని   ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్లతో పాటు ఆసీస్ మాజీలు కూడా సుద్దులు చెబుతున్నారు. 

రెండ్రోజుల క్రితం ఆసీస్  మాజీ సారథి ఇయాన్ హీలి మాట్లాడుతూ..  ‘సమతూకమైన పిచ్ లను తయారు చేస్తే భారత్ లో ఆస్ట్రేలియాదే విజయం.  స్పిన్ పిచ్ లను కాకుండా   బ్యాటింగ్, బౌలింగ్ కు  అనుకూలించే పిచ్ లను తయారుచేయాలి.  అప్పుడు భారత్ లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు..’ అని  అన్నాడు. 

హీలితో పాటు గతంలో ఆ జట్టు మాజీ క్రికెటర్లు  ఒకెఫీ, ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కూడా  ఇవే కారుకూతలు కూశారు.   పిచ్ లతో పాటు జట్టు బలబలాలు,  ఇతరత్రా విషయాల గురించి వ్యాఖ్యలు చేస్తూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు.  ఈ నేపథ్యంలో  టీమిండియా  మాజీ సారథి, దిగ్గజ బ్యాటర్  సునీల్ గవాస్కర్  స్పందించాడు. 

ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్ లో  గవాస్కర్ స్పందిస్తూ.. ‘పిచ్ ల గురించి  అదే పనిగా  మాట్లాడటం  ఆస్ట్రేలియా వ్యూహంలో భాగం. ఇండియా పిచ్ ల గురించి మాట్లాడుతున్నారు సరే. మరి నిన్నగాక మొన్ననే మీ దేశంలో దక్షిణాఫ్రికాతో బ్రిస్బేన్ వేదికగా  రెండో టెస్టు జరిగింది.  రెండంటే రెండు రోజుల్లోనే ఆ టెస్టు ముగిసింది. మరి దాని గురించి మాట్లాడరేం..? నాలుగు ఇన్నింగ్స్ ల  ఆట రెండ్రోజుల్లో ముగియడం  ఏమిటి..? 

బ్రిస్బేన్ వంటి పిచ్  పై ఆటగాళ్లు  భయపడిపోయారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని  ఆడారు.  స్పిన్ పిచ్ ల వల్ల  ఆటగాళ్లకు వచ్చిన ఇబ్బందులేమీ లేవు. బ్రిస్బేన్ పిచ్ పై విమర్శలు వచ్చిన తర్వాత  క్రికెట్ బ్యాటర్ల ఆటగా మారిందని ఆసీస్ మీడియాలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కూతలు కూయడం అక్కడ మామూలే.  కానీ ఇండియాకు వచ్చేసరికి మాత్రం ఇది వర్తించదా..?’అని పేర్కొన్నాడు. 

కాగా ఇయాన్ హీలితో పాటు ఆసీస్ క్రికెటర్లు చేసిన కామెంట్స్ పై  భారత మాజీ కోచ్, న్యూజిలాండ్ దిగ్గజం జాన్  రైట్ కూడా స్పందించాడు.  టెస్టులకు ఆతిథ్యమిచ్చే దేశాలు  తమకు అనుకూలంగా  పిచ్ లను తయారుచేసుకోవడం కొత్త కాదని, అది సర్వసాధారణమైన విషయమని అన్నాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా నీతులు చెప్పడం విడ్డూరమని  చెప్పాడు.  

click me!