అతడి అవసరం ఉందనిపించింది.. అందుకే శాంసన్‌ను పక్కనబెట్టక తప్పలేదు : శిఖర్ ధావన్

First Published Nov 27, 2022, 4:30 PM IST

Sanju Samson: ఇండియా-న్యూజిలాండ్ మధ్య  రెండో వన్డే వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. అయితే జట్టు కూర్పుపై  విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సంజూ శాంసన్ ను  తుది జట్టులో చేర్చకపోవడం విమర్శలకు తావిచ్చింది. 

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా  హమిల్టన్ వేదికగా ముగిసిన రెండో వన్డేల భారత తుది జట్టు కూర్పుపై మరోసారి విమర్శలు చెలరేగాయి. తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన సంజూ శాంసన్ ను పక్కనబెట్టడం, పదే పదే విఫలమవుతున్నా రిషభ్ పంత్ ను కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.  

రెండో వన్డేలో టాస్ సందర్భంగా  ధావన్ జట్టులో మార్పుల గురించి చెబుతూ.. సంజూ శాంసన్ ప్లేస్ లో  దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకున్నామని అన్నాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా  తీవ్ర దుమారం రేగింది. సంజూ కెరీర్ ను ఎందుకిలా నాశనం చేస్తున్నారని..? అతడు దక్షిణాదికి చెందినవాడు కావడం వల్లే ఇలా చేస్తున్నారా..? అని  నెటిజన్లు బీసీసీఐపై దుమ్మెత్తి పోశారు. 

ఈ నేపథ్యంలో రెండో వన్డే అర్థాంతరంగా ముగిసిన  తర్వాత ధావన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. తమకు ఆరో బౌలర్ అవసరం ఉన్నాడని,  అందుకే జట్టులో మార్పులు చేశామని చెప్పుకొచ్చాడు. 

ధావన్ మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్ లో మేం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాం. కానీ ఆ మ్యాచ్ లో భారత్ ఓడింది. బౌలింగ్ లో మా ప్రణాళికలు సరిగ్గా అమలుకాలేదు.  ఆరో బౌలర్ అవసరం ఉందని  అనిపించింది.  అందుకే ఈ మ్యాచ్ లో  తప్పనిసరి పరిస్థితుల్లో సంజూను పక్కనబెట్టి  దీపక్ హుడాను తీసుకున్నాం. 

పిచ్ స్వింగ్ కు అనుకూలంగా ఉందని  భావించి శార్దూల్ స్థానంలో దీపక్ చాహర్ కు అవకాశమిచ్చాం.   అదనపు బౌలర్ కోసమే సంజూను పక్కనబెట్టాం.. దీనిపై రాద్దాంతం అవసరం లేదు..’ అని  ధావన్ చెప్పుకొచ్చాడు. ధావన్  తన వివరణతో ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చినా  నెటిజన్లు మాత్రం  ట్రోలింగ్ ఆపలేదు. 

పక్కనబెట్టాల్సి వస్తే ప్రతీ మ్యాచ్ లో విఫలమవుతున్న పంత్ ను పక్కనబెట్టాలి గానీ   శాంసన్ తన స్థానాన్ని ఎందుకు త్యాగం చేయాలి... అని ప్రశ్నిస్తున్నారు. అసలు టీమిండియా మేనేజ్మెంట్  పంత్ కు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తుందో తెలియదని.. ఇది మాత్రం కచ్చితంగా శాంసన్ మీద వివక్షే అని వాపోతున్నారు. 

మ్యాచ్ విషయానికొస్తే..  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటింగ్ కు వచ్చింది.  నాలుగు ఓవర్లు కూడా పూర్తికాకముందే వర్షం అంతరాయం కలిగించింది. తిరిగి కొద్దిసేపటికి వర్షం తగ్గినా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు.  మళ్లీ రెండోసారి మ్యాచ్ మొదలయ్యాక  భారత స్కోరు 89-1గా (12.5 ఓవర్లు) వద్ద ఉండగా  వరుణుడు మళ్లీ  కురిశాడు. ఈసారి వాన ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ అర్థాంతరంగా రద్దైంది. 

click me!