రిషభ్ పంత్‌కు గాయం..? సిరీస్ మొత్తానికి దూరం.. మళ్లీ గ్లవ్స్ వేసుకోనున్న టీమిండియా వైస్ కెప్టెన్

First Published Dec 4, 2022, 11:51 AM IST

BANvsIND: బంగ్లాదేశ్ తో తొలి వన్డే సందర్భంగా భారత్.. టాస్ ఓడి  తొలుత బ్యాటింగ్ చేయనుంది.  అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ లేకుండానే బరిలోకి దిగుతున్నది. తొలి మ్యాచ్ తో పాటు సిరీస్ మొత్తానికి పంత్ దూరమయ్యాడు. 

బంగ్లాదేశ్ - ఇండియా నడుమ ఢాకాలోని  షేర్ బంగ్లా నేషనల్  స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా మొదలు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో పలు మార్పులు జరిగాయి. ఏకంగా ఆరుగురు బౌలర్లతో భారత్ బరిలోకి దిగుతున్నది.  

తుది జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లు బ్యాటర్లు. వాషింగ్టన్ సుందర్,  షాబాజ్ అహ్మద్ స్పిన్ ఆల్ రౌండర్లు కాగా శార్దూల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ లతో పాటు అరంగేట్ర కుర్రాడు  కుల్దీప్ సేన్  పేస్ బాధ్యతలు మోయనున్నాడు.

అయితే ఈ మ్యాచ్ లో భారత్ రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ లేకుండానే బరిలోకి దిగుతున్నది. బీసీసీఐ వైద్యుల సూచన మేరకు పంత్  ను ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ కు కూడా దూరంగా ఉంచుతున్నామని, అతడు టెస్టు సిరీస్ వరకు జట్టుతో జాయిన్ అవుతాడని బీసీసీఐ తెలిపింది. అంతేగాక అతడి రిప్లేస్మెంట్ ను కూడా ప్రకటించలేదని  వివరించింది.   తొలి వన్డేలో అక్షర్ పటేల్  కూడా అందుబాటులో  లేడని ట్విటర్ ద్వారా తెలిపింది. 

బీసీసీఐ ట్వీట్  తో టీమిండియా ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలు తలెత్తాయి.  పంత్ కు గాయమైందా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కొద్దిరోజుల క్రితమే  అతడు న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆడినప్పుడు కూడా పంత్ గాయపడ్డ వార్తలేమీ రాలేదు. మరి ఉన్నట్టుండి పంత్ ను ఎందుకు పక్కనబెట్టారనేది చర్చనీయాంశం. 

ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో  పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో సంజూ శాంసన్ ను బెంచ్ కే పరిమితం చేసి  ప్రతీ మ్యాచ్ లో  అవకాశమిచ్చినా పంత్ వాటిని ఉపయోగించుకోలేదు. ఒక్క మ్యాచ్ లో కూడా  ఇరవై పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు రావడంతోనే ఈ వన్డే సిరీస్ కు పట్టించుకోలేదనే   నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. 

పంత్  కు బ్యాకప్ గా ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను కూడా తుది జట్టులోకి తీసుకోలేదు.  కెఎల్ రాహుల్ కే తిరిగి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పింది టీమిండియా. అలా అయితే భారత్ కు ఆరో బౌలర్ కొరత కూడా తీరుతుంది. మరి వన్డే ప్రపంచకప్ వరకూ ఇదే  ఫార్ములాను ఫాలో అవుతారా.?? లేక ఒక్క బంగ్లాదేశ్ సిరీస్ వరకే ఇది పరిమితం చేస్తారా.?? అన్నది తేలాల్సి ఉంది.  

పంత్ తో పాటు  అక్షర్ పటేల్ ను కూడా పక్కనబెట్టడం  అనుమానాలకు తావిస్తున్నది.  టీ20 ప్రపంచకప్ లో  రవీంద్ర జడేజా గాయపడటంతో ఆ స్థానాన్ని దక్కించుకున్న  అక్షర్..  ఈ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేదు.  దీంతో అతడిని న్యూజిలాండ్ తో సిరీస్ లో పక్కనబెట్టింది టీమ్ మేనేజ్మెంట్.. ఆ సిరీస్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించిన వాషింగ్టన్ సుందర్ ను ఈ సిరీస్ లోనూ కొనసాగిస్తున్నది. 

click me!