అశ్విన్‌ రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ స్పిన్నర్.. నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్..

First Published Dec 4, 2022, 3:23 PM IST

AUSvsWI: ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్  తాజాగా ఆస్ట్రేలియా - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా   విండీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో చెలరేగాడు.

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ఆదివారం పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్.. విండీస్ పై 164 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ పోరాడినా ఆ జట్టు పోరాటాన్ని దెబ్బతీశాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్. 

ఈ మ్యాచ్ లో లియాన్.. తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లే తీసినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం  6 వికెట్లతో చెలరేగాడు. విండీస్ ప్రధాన బ్యాటర్లైన  క్రెయిగ్ బ్రాత్‌వైట్ తో పాటు బ్రూక్స్, బ్లాక్‌వుడ్, కైల్ మేయర్స్, రోస్టన్ చేజ్ వంటి వాళ్లంతా  లియాన్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరారు.  పేస్ కు అనుకూలించని పెర్త్ పిచ్ పై   లియాన్ స్పిన్ తో విండీస్ ను బోల్తా కొట్టించాడు.  

పెర్త్ లో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయడం ద్వారా  టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బద్దలుకొట్టాడు.  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల (టెస్టు) జాబితాలో అశ్విన్ ను అధిగమించిన  లియాన్.. 8 వ స్థానానికి చేరాడు. 

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ (పురుషుల) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ల జాబితాలో  ఈ మ్యాచ్ కు ముందు  అశ్విన్.. 86 టెస్టులలో 442 వికెట్లు తీసి 8వ స్థానంలో ఉండేవాడు. కానీ ఈ మ్యాచ్ తర్వాత 9వ స్థానంలో ఉన్న లియాన్.. 443 (111 టెస్టులు) వికెట్లు తీసి  ఒకస్థానం పైకి ఎగబాకాడు. 

ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్.. 133 టెస్టులలో 800 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. 145 టెస్టులలో 708 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్.. 176 టెస్టులలో 667 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 

ఆ తర్వాత అనిల్ కుంబ్లే.. 132 టెస్టులలో 619 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా  ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. 159 టెస్టులలో 566 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ దిగ్గజ  పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. 124 టెస్టులలో 563 వికెట్లు తీశాడు.  వెస్టిండీస్ పేసర్ కోట్నీ వాల్ష్.. 124 టెస్టులలో 519 వికెట్లతో ఏడో స్థానంలో ఉండగా తర్వాత ప్లేస్ లియాన్ దే కావడం గమనార్హం. 

ప్రస్తుతం వన్డే, టీ20లలో పెద్దగా కనిపించని లియాన్ పూర్తిగా టెస్టు క్రికెట్ మీదే దృష్టిపెట్టాడు.  లియాన్ నెక్స్ట్ టార్గెట్  కోట్నీ వాల్ష్  (519 వికెట్లు) రికార్డును బ్రేక్ చేయడమే. మరి ఈ ఆసీస్ వెటరన్ విండీస్ వీరుడి రికార్డులను బద్దలుకొడతాడా..? లేదా..? అనేది కాలమే నిర్ణయించనుంది. 

click me!