ఆ క్యూరేటర్‌ను సిడ్నీకి పంపించండి ప్లీజ్... టీమిండియాకు సపోర్ట్ చేసిన నాథన్ లియాన్...

First Published | Feb 28, 2021, 12:10 PM IST

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు పిచ్ గురించి తీవ్రంగా విమర్శలు చేస్తోంది. తమ బ్యాటింగ్ వైఫల్యానికి మొతేరా పిచ్ స్పిన్‌కి అనుకూలించడమే కారణమంటూ కొంటె సాకులు చెబుతోంది. దీనిపై టీమిండియా ప్లేయర్లు రోహిత్, రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ అవ్వగా తాజాగా ఈ లిస్టులోకి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా వచ్చి చేరాడు...

‘చాలా దేశాల్లో పేస్ బౌలింగ్‌కి సహకరించే పిచ్‌లు ఉంటాయి. ఆ పిచ్‌ల మీద 47, 60 పరుగులకి ఆలౌట్ చేసినా ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు పిచ్ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడరు...
అయితే ఎప్పుడైనా పిచ్ స్పిన్‌కి సహకరించడం మొదలెడుతుందో అందరూ ఏడవడం మొదలెట్టేస్తారు.. నాకు ఇది అర్థం కాలేదు... స్పిన్ అయినా, పేస్ అయినా క్రికెట్‌ మజాని అందిస్తుంది...

నేను ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడు టెస్టులను ఎంతో ఆసక్తిగా చూశాను. ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ అద్భుతంగా జరిగాయి. మొతేరా పిచ్ క్యూరేటర్‌ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకురావాలని అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్...
గబ్బాలో టీమిండియాతో జరిగిన నాలుగో టెస్టు, నాథన్ లియాన్‌కి 100వ టెస్టు మ్యాచ్. 100 టెస్టుల్లో 399 వికెట్లు తీసిన నాథన్ లియాన్, 400వ వికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.
నాథన్ లియాన్‌, తనకి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే ఎంతో అభిమానం అని ప్రకటించిన విషయం తెలిసిందే... లియాన్ కంటే ఎంతో వెనకాల ఉన్న అశ్విన్, మూడో టెస్టులో 400 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుసగా రెండు టెస్టులు గెలిచిన టీమిండియా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి మరింత చేరువైంది. అయితే ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఆఖరి టెస్టులో గెలవాలి లేదా డ్రా చేసుకోవాలి. ఆఖరి టెస్టులో ఓడిపోతే, ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఇప్పటికే న్యూజిలాండ్ అర్హత సాధించడంతో మరో ఫైనలిస్టుని నిర్ణయించే నాలుగో టెస్టు కోసం టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.

Latest Videos

click me!